భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతాంగం యాసంగి సాగుకు సన్నద్ధమవుతోంది. బోరుబావుల కింద వరిసాగు చేపట్టేందుకు నారు మడులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వానాకాలం వరికోతలు 80 శాతం మేర పూర్తయ్యాయి. ఈ సారి సన్నాలకు బహిరంగ మార్కెట్‌లోనే మద్దతుకు మించి ధర వచ్చింది. దీంతో ఇప్పటి వరకు కోసిన వరిపంటంతా విక్రయించి యాసంగి సాగు వైపు మళ్లారు. ప్రధానంగా తొందరగా నాట్లు పడితే.. ఎండలు ముదరక ముందే పంట చేతికి రావడమే కాకుండా కరెంట్, నీటి సమస్య నుంచి బయటపడతామని రైతులు భావిస్తూ ముందస్తుగానే వరిసాగు చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రచారాన్ని లెక్క చేయకుండా..
ఎల్‌నినో కారణంగా జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం సీజన్‌లోనూ అక్కడక్కడా రైతులు పంటలను కోల్పోయారు. అలాగే భూగర్భ జలాలు తగ్గిపోవడం, చెరువుల్లో నీరు లేని కారణంగా యాసంగి వరిసాగు చేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రైతులను వరిసాగు చేయొద్దని, ఆరుతడి పంటలను, కూరగాయల సాగు చేపట్టాలంటూ సూచిస్తున్నారు. అయినా కొందరు రైతులు గతంలో సాగుచేసిన విస్తీర్ణంలో సగంలోనైనా యాసంగి వరినాట్లు పెట్టుకుంటామని సాగులో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొందరు రైతులు నారుమళ్లు దున్నడం పూర్తిచేసుకోగా మరొకొందరు ఏకంగా నారుకు మొలకలు చల్లుకున్నారు.
వరి విత్తనం పిరమే..
జిల్లాలో వరిసాగు చేయకుండా నీటి అవసరం తక్కువగా ఉన్న ఆరుతడి, కూరగాయలు తదితర పంటలను మాత్రమే సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచిస్తోంది. కొందరు రైతులు బోరుబావుల వసతి ఉందని, వానాకాలం సీజన్‌లో సన్నవడ్లకు మంచి ధర ఉండడంతో ఇదే ధర యాసంగిలోనూ ఉంటుందన్న ఆశతో వరిసాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో వరి విత్తనాలను కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లగా.. ఎమ్మార్పీ ధర కంటే అధికంగా రూ.200 నుంచి రూ.300 వరకు వ్యాపారులు వసూలు చేస్తున్నారు. ఇందులోనూ సన్నరకం వరి విత్తనాలకు పలుచోట్ల అధిక ధరను తీసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనను లెక్క చేయకుండా వరిసాగు చేస్తున్న రైతులకు కాలం ఏమైనా కలిసొస్తుందా..? లేదంటే పంటలను కోల్పోవాల్సిన వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఫ నార్లు పోసుకుంటున్న రైతాంగం
ఫ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
వరి వద్దంటున్న ప్రభుత్వం
ఫ అయినా వరిసాగుకే రైతన్న మొగ్గు


