వేగం తగ్గరు! | - | Sakshi
Sakshi News home page

వేగం తగ్గరు!

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

హెల్మెట్‌ పెట్టరు..

సూర్యాపేటటౌన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడంలో నిర్లక్ష్యం చూపుతుండగా.. మరోవైపు వాహనాల వేగానికి కళ్లెం వేయడం లేదు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన ట్రాఫిక్‌ ఉల్లంఘనల గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించిన కేసులు ఏకంగా 40,895 నమోదయ్యాయి. ఓవర్‌ స్పీడ్‌ కేసులు 11,845 ఉండటం గమనార్హం. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల తీరు మారడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

హెల్మెట్‌

లేకుండానే ప్రయాణం

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ చాలామంది నిబంధనలను పట్టించుకోవడం లేదు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినందుకు అత్యధికంగా 40,895 కేసులు నమోదయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటంలో హెల్మెట్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు 6,692 నమోదయ్యాయి. ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. 18 ఏళ్లలోపు వాహనాలు నడిపినందుకు 459 కేసులు నమోదయ్యాయి.

వేగ పరిమితి పాటించకుండా..

అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. జిల్లాలో మొత్తం 11,845 ఓవర్‌ స్పీడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు చక్రాల వాహనాలపై 11,525 కేసులు ఉండగా.. ద్విచక్ర వాహనాలపై 119, మూడు చక్రాల వాహనాలపై 4, ఇతర వాహనాలపై 170 కేసులు నమోదయ్యాయి. నిర్ణీత వేగ పరిమితిని పాటించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 7,630 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

పార్కింగ్‌లోనూ ఇష్టారాజ్యం

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల్లో అనధికార పార్కింగ్‌, రహదారులపై వాహనాలతో అడ్డంకులు సృష్టించిన కేసులు 5,838 నమోదయ్యాయి. సీటు బెల్టు ధరించకుండా ప్రయాణించినందుకు 1,035 కేసులు, వాహనాల్లో ఓవర్‌లోడింగ్‌కు సంబంధించి 76 కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు ప్రమాదాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలనూ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో ఇవే అధికం

ఈ–చలాన్ల నమోదులో

ద్విచక్ర వాహనదారులే ఎక్కువ

రోడ్డు భద్రతా నియమాలను

పట్టించుకోని వైనం

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడంతో పాటు, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలి. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, ట్రిపుల్‌ రైడింగ్‌ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానాల భయంతో కాకుండా, మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుకోవాలనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి.

– నరసింహ, ఎస్పీ

ఈ ఏడాది నమోదైన కేసులు

హెల్మెట్‌ లేకుండా : 40,895

ఓవర్‌ స్పీడ్‌ : 11,845

ట్రిపుల్‌ రైడింగ్‌ : 6,692

డ్రంకెన్‌ డ్రైవింగ్‌ : 7,630

అనధికార పార్కింగ్‌ : 5,838

మైనర్‌ డ్రైవింగ్‌ : 459

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement