చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో వివేకానంద వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య విషయాలు, ఆర్థిక స్థితులు, వారు నివసిస్తున్న గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.
నీటి సంరక్షణ
పనులు చేపట్టాలి
మునగాల: ప్రతిఒక్కరు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ సన్యాసయ్య అన్నారు. గురువారం మునగాల మండలంలోని బరాఖత్‌గూడెంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, రైతులు ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో జలసిరి కార్యక్రమం కింద చేపట్టిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం, కమ్యూనిటీ సోక్‌పిట్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీఓ నరేష్, సర్పంచ్ చల్లా గుర్వయ్య, ఏపీఓ శైలజ, ఈసీ కళ్యాణ్, ఏపీఎం కరుణాకర్, టీఏ శ్రీధర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పవన్, ఫీల్డ్ అసిస్టెంట్ దొంతిరెడ్డి సులోచన పాల్గొన్నారు.
గ్రామాల్లో సమస్యలు రాకుండా చూడాలి
తుంగతుర్తి (నూతనకల్) : ఎల్‌నినో ప్రభావం కారణంగా గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని డీఎల్‌పీఓ నారాయణరెడ్డి సూచించారు. గురువారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జలసిరి పనులపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వీబీజీరాంజీ ద్వారా కూలీలకు పని కల్పించాలని, ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రైన్‌లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రేయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌కు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ సునీత, ఎంపీఓ హరిసింగ్, కార్యదర్శులు పాల్గొన్నారు.


