కొనుగోలు కేంద్రాలేవీ? | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలేవీ?

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

భానుపురి (సూర్యాపేట): జిల్లాలో వానాకాలం వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌లో దొడ్డు, సన్న రకాలకు మంచి ధర ఉండగా.. నాలుగైదు రోజులుగా దొడ్డు రకం ధాన్యం ధరను వ్యాపారులు అమాంతం తగ్గించేశారు. ప్రభుత్వ మద్దతు ధరకై నా ధాన్యాన్ని అమ్ముకుందామనుకుంటే ఇప్పటివరకు జిల్లాలో ఒక్క సెంటర్‌ కూడా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.

తెరుచుకోని కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 3.71 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా రైతుల నుంచి సేకరించాలని జిల్లా యంత్రాంగం భావించింది. ఇందుకుగాను అన్ని మండలాల్లోనూ కలిపి 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయినప్పటికీ, ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కొనుగోలు సెంటర్‌ను కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు.

25 రోజులుగా వరి కోతలు..

జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల పరిధిలో 25 రోజులుగా వరి కోతలు జరుగుతున్నాయి. బోరుబావుల కింద రోహిణి కార్తెలో నాటు వేసిన పొలాలు ముందుగా కోతకు వచ్చాయి. ఇందులో సన్న, దొడ్డు రకాల ధాన్యం ఉండగా.. ప్రారంభంలో రెండింటికీ ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించింది. సన్న ధాన్యానికి రూ.4,400, దొడ్డు రకానికి రూ.2,400 వరకు ధర పలికింది. మిల్లుల్లోనే కాకుండా సూర్యాపేట, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనూ మంచి ధర ఉండడంతో రైతులు నేరుగా బహిరంగ మార్కెట్లోనే అమ్మకానికి మొగ్గు చూపారు.

ధర తగ్గింపుతో ఆందోళన..

గత నాలుగైదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా దొడ్డు, సన్న రకాల వడ్లకు వ్యాపారులు క్వింటాకు రూ.400 వరకు ధర తగ్గించారు. మిల్లులతో పాటు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనూ తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్‌ యార్డుల్లో రైతులు ధరల తగ్గింపుపై ధర్నాలు కూడా చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడం రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. సన్న రకం ధాన్యానికి బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధరకు మించే లభిస్తున్నప్పటికీ, దొడ్డు రకానికి మాత్రం వ్యాపారులు రూ.1,700 నుంచి రూ.1,900 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు తెరిస్తే మద్దతు ధరకు అమ్ముకునేవారమని, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం సెంటర్లను ప్రారంభించకపోవడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరి కోతలు మొదలైనా

తెరుచుకోని కేంద్రాలు

ఇదే అదునుగా ధర తగ్గిస్తున్న

వ్యాపారులు

దొడ్డు రకం క్వింటాకు

రూ.1,700లకే కొనుగోలు

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

పేట మార్కెట్లో రైతుల ఆందోళన

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులంతా ఏకమై ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. మూడు రోజులుగా మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేశారని, గురువారం పెద్ద మొత్తంలో ధాన్యం రాగానే వివిధ సాకులు చెబుతూ ధర తగ్గించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం అన్ని రకాల ధాన్యానికి మద్దతు ధరకు మించి ధర పెట్టిన వ్యాపారులు.. రైతులంతా మార్కెట్‌కు వస్తుండడంతో, వచ్చిన రైతులు వేరేచోటికి పోలేరు అనే ధీమాతో ధరలు తగ్గిస్తున్నారని మార్కెట్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్కెట్‌ అధికారులు పోలీసులను రంగంలోకి దించి రైతులతో చర్చలు జరిపారు. ఎవరికీ అన్యాయం జరగకుండా తగిన ధర ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, గురువారం ఒక్కరోజే మార్కెట్‌కు 44 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement