ఆక్రమణలు తొలగించాలి
కోదాడ : అధికారుల నిర్లక్ష్యం, భవన యజమానుల స్వార్థం కోదాడ పట్టణ ప్రజలకు తీవ్రమైన పార్కింగ్ కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ సమయంలో పార్కింగ్ కోసం సెల్లార్లను కేటాయించాలి. కానీ, యజమానులు ఆ సెల్లార్లలో సైతం దుకాణాలను ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తుండడంతో.. షాపింగ్ కోసం వచ్చే వినియోగదారులు స్థలం లేక తమ వాహనాలను రోడ్లపైనే నిలపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగం నిద్రావస్థలో ఉండగా.. పోలీసులు సమస్య మూలాలను వదిలేసి, కేవలం రోడ్డుపై నిలిపిన వాహనాలకు జరిమానాలు వేయడమే తమ పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 80 వేలకు పైగా జనాభా ఉన్న కోదాడ పట్టణంలో ఒక్కటంటే ఒక్క పబ్లిక్ పార్కింగ్ స్థలం కూడా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుచించుకుపోయిన రోడ్డు..
కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ పక్కన ఉన్న ఆజాద్‌నగర్ ప్రధాన రహదారి వాస్తవానికి 40 అడుగుల వెడల్పు ఉండాలి. పట్టణంలోని సగం మంది ప్రజలు ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, ఆక్రమణలు పెరిగిపోవడంతో ప్రస్తుతం ఈ రోడ్డు 25 అడుగులకు కుచించుకుపోయింది. దీనికితోడు రోడ్డు ప్రారంభంలో రంగా థియేటర్‌కు చెందిన వాణిజ్య సముదాయంలో ఏర్పాటు చేసిన ఒక హోటల్ వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రంగా థియేటర్ నుంచి బాలికల పాఠశాల వరకు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో బడికి వెళ్లే విద్యార్థినులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భవనాల సెల్లార్లను
అద్దెకిస్తున్న యజమానులు
కోదాడలో తీవ్రమవుతున్న
పార్కింగ్ కష్టాలు
చోద్యం చూస్తున్న
టౌన్‌ప్లానింగ్ అధికారులు
జరిమానాలతో సరిపెడుతున్న పోలీసులు
కోదాడ పట్టణంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ముందుగా గల్లీ రోడ్లలో ఆక్రమణలు తొలగించాలి. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణాలు, బ్యాంకుల ఎదుట వాహనాలు నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
– నాళం రాజన్న, న్యాయవాది, కోదాడ
ప్రతిచోటా ఇదే పరిస్థితి..
ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్లే గల్లీ రోడ్ల మూలమలుపుల వద్ద డబ్బా కొట్లను ఏర్పాటు చేస్తుండడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కల్లూరి రాములు వీధి, రంగా థియేటర్ ఎదురు వీధి, సాయిబాబా థియేటర్ రోడ్డు, బొడ్రాయి బజార్, యాదవ బజార్, అనంతగిరి రోడ్డు, ఎస్సీ కళాశాల రోడ్డు.. ఇలా ప్రతిచోటా ట్రాఫిక్ కష్టాలే దర్శనమిస్తున్నాయి. ఆయా రోడ్లలోని బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలకు వచ్చేవారు పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇటీవల కోదాడ ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వస్త్ర దుకాణాలను ఏర్పాటు చేశారు. వాటికి సైతం సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతంలోనూ ట్రాఫిక్ స్తంభిస్తోంది.


