అవస్థల రిజిస్ట్రేషన్‌! | - | Sakshi
Sakshi News home page

అవస్థల రిజిస్ట్రేషన్‌!

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు

వసతుల్లేని కార్యాలయాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రిజిస్ట్రేషనన్‌ శాఖ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు అరకొర వసతులు.. ఇంకోవైపు ముడుపుల ఆరోపణలు.. వెరసి రిజిస్ట్రేషనన్‌ కోసం వచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ సగటున 150 నుంచి 200కు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో ఈ సంఖ్య 300కు చేరుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నా.. చాలా కార్యాలయాల్లో కనీస వసతులు లేవు.

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా..

కార్యాలయ అధికారులు, సిబ్బంది డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వసూళ్ల వ్యవహారం నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి విలువ, డాక్యుమెంట్‌ స్వభావాన్ని బట్టి అదనపు మొత్తాలను నిర్ణయిస్తున్నారని పలువురు చెబు తున్నారు. రోజులో ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.. వాటి విలువ అనే దాని ఆధారంగా డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి సాయంత్రం మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీకి చిక్కినా కానరాని మార్పు..

భూమి కొనుగోలు, అమ్మకాలు, గిఫ్ట్‌, సెటిల్‌మెంట్‌, ఇతర డాక్యుమెంట్ల విషయంలో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారిక రుసుములకు అదనంగా డబ్బులు ఇవ్వకపోతే ఫైల్‌లో లోపాలు చూపించడం, చిన్నచిన్న కొర్రీలు పెట్టడం, ప్రక్రియను ఆలస్యం చేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. సూర్యాపేట సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో గతంలో ఓ సబ్‌ రిజిస్టర్‌ అన్ని పత్రాలు ఉన్నప్పటికీ లంచం డిమాండ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత కూడా కార్యాలయ సిబ్బంది పనితీరులో మార్పు లేదు. మిర్యాలగూడలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారు నేరుగా కార్యాలయానికి వస్తే రిజిస్ట్రేషన్‌ చేసే పరిస్థితి లేదు. డాక్యుమెంట్‌ రైటర్లు ఫైల్స్‌ చేసి పంపిస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిడమనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్లకు నిర్ణీత ఫీజు కాకుండా అధిక మొత్తంలో డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సర్వర్‌ సమస్యలు, నెట్‌వర్క్‌ అంతరాయాలు, డాక్యుమెంట్ల అప్‌లోడ్‌, బయోమెట్రిక్‌ తదితర ప్రక్రియల్లో సాంకేతిక ఇబ్బందులతో హుజూర్‌నగర్‌ తదితర కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి కొనుగోలుదారులు, విక్రయదారులు మరుసటి రోజు రావాల్సి వస్తోంది. నిడమనూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారం, పది రోజులుగా ఈసీ(ఎనకంబెరెన్స్‌ సర్టిఫికేట్‌) సాంకేతిక కారణాలతో రావడం లేదు. దేవరకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలో సర్వర్‌ డౌన్‌తో రిజిస్ట్రేషన్లు సకాలంలో కాకపోవడంతో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలు,అమ్మకందారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ అద్దె భవనాల్లో రిజిస్ట్రేషన్ల తిప్పలు

ఫ ఇరుకై న గదులు.. అరకొర వసతులు

ఫ ఆపై డాక్యుమెంట్‌ రైటర్లతో అడ్డగోలుగా వసూళ్లు

ఫ ముడుపులిస్తే వెంటనే.. లేదంటే తంటానే..

ఫ మరోవైపు వేధిస్తున్న సాంకేతిక సమస్యలు

సూర్యాపేట సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి పక్క భవనం లేకపోవడం, ఉన్న చిన్నపాటి అద్దె భవనంలో స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోజుకు 50 వరకు డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం క్రయవిక్రయ దారులే కాకుండా ఇరుపక్షాల సాక్షులు సైతం వస్తుండడంతో చిన్నపాటి గదిలు ఏమాత్రం సరిపోవడం లేదు. బయట చెట్ల కింద కూర్చొని తమను పిలిచినప్పుడు వెళ్లి సంతకాలు, ఫొటోలు దిగి బయటికి వస్తున్నారు.

అద్దె భవనంలో కొనసాగుతున్న మిర్యాలగూడ సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం పైఅంతస్తులో ఉండటంతో వృద్ధులు, వికలాంగులు పైఅంతస్తుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కార్యాలయంలో సబ్‌రిజిస్టార్‌తో కలిపి మొత్తం ఏడుగురు ఉద్యోగులు ఉండగా అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న సిబ్బంది సైతం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సైతం పాత మున్సిపల్‌ భవనంలో కొనసాగుతోంది. భవనం పాతబడటంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరమ్మతులు కూడా సరిగా చేయని పరిస్థితి నెలకొంది. రోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే కార్యాలయంలో కనీస వసతులు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement