రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతాం
చిరుధాన్యాలతో వంటకాలు...
ప్రతిరోజు 60 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు సూర్యాపేట జిల్లాలో కేంద్రీకృత వంటశాల ఏర్పాటు చేయనున్నారు. మునగాల మండలం సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వంటశాలను నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌న్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.9.60 కోట్లను అందిస్తోంది. నిర్మాణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని
1,029 విద్యాసంస్థలకు
సయ్యద్ ముజావర్‌పేటలో ఏర్పాటు చేయనున్న కేంద్రీకృత వంటశాల ద్వారా సూర్యాపేట జిల్లాలోని విద్యాసంస్థలకు ప్రతిరోజు ఆహారం సరఫరా చేయనున్నారు. జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 60 వేల మంది విద్యార్థులకు తాజా ఆహారం లభించనుంది. ఒకే చోట పెద్ద స్థాయిలో ఆహారాన్ని తయారు చేసి, నాణ్యతా పరీక్షలు నిర్వహించి, ప్యాకింగ్ చేసి నిర్ణీత సమయానికి విద్యాసంస్థలకు తరలించేలా ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
నల్లగొండ జిల్లాలోని నాలుగు మండలాలకు..
కేంద్రీకృత వంటశాల సేవలను నల్లగొండ జిల్లాలోని నాలుగు మండలాలకు కూడా అందించనున్నారు. నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, వేములపల్లి మండలాల్లోని 131 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఇక్కడి నుంచే ఆహారం సరఫరా చేయనున్నారు. దాంతె ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న 7,972 మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది.
పరిశుభ్రతకు పెద్దపీట...
వంటశాలలో ఆహార తయారీ నుంచి ప్యాకింగ్, రవాణా, పంపిణీ వరకు ప్రతి దశలో పరిశుభ్రత, నాణ్యత, పోషక విలువలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి విద్యాసంస్థకు నిర్ణీత సమయానికి ఆహారం చేరేలా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. భారీ స్థాయిలో ఆహారం తయారీకి ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థుల ఆరోగ్యం, చదువు, భవిష్యత్‌కు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుకు రూ. 9.60 కోట్లు అందించిన సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు. ప్రభుత్వరంగ సంస్థలు సీఎస్‌ఆర్ నిధులతో ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ఆస్తులను ఎలా సృష్టించవచ్చో ఈ కేంద్రీకృత వంటశాల చాటి చెబుతుంది. సయ్యద్ ముజావర్‌పేట వంటశాలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
–మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ రూ.9.60 కోట్ల సింగరేణి
సీఎస్‌ఆర్ నిధులతో నిర్మాణం
ఫ 100 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక
విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన సమతుల ఆహారం అందించనున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసే సంప్రదాయ పౌష్టిక వంటకాలను కూడా అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ సహకారంతో పోషక విలువలకు అనుగుణంగా మెనూను రూపొందించనున్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారం అందడం వల్ల హాజరు, ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం మెరుగుపడటంతోపాటు బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.


