హైవే–167పై చీకట్లు | - | Sakshi
Sakshi News home page

హైవే–167పై చీకట్లు

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

బదలాయింపులో చిక్కులు..

చిలుకూరు : కోదాడ నుంచి చిలుకూరు, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, హాలియా మీదుగా జడ్చర్ల వరకు వెళ్లే జాతీయ రహదారి–167 నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్‌హెచ్‌ఏఐ) బదలాయించింది. ఈ మేరకు ఇటీవల గెజిట్‌ విడుదల కాగా, మరో వారం రోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు బాధ్యతలు తీసుకోనుంది. 2017–18లో కోదాడ నుంచి జడ్చర్ల వరకు 234 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించారు. ఇన్ని రోజులపాటు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్‌ ఈ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోక పోవడంతో హైవేపై లైట్లు వెలగక చీకట్లు కమ్ముకున్నాయి.

నిర్వహణపై సందిగ్ధం

రోడ్డు విస్తరణ సమయంలో 100 అడుగుల మేర స్థలం సేకరించి, 10 మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు వేశారు. గ్రామాల పరిధిలో పలుచోట్ల నాలుగు వరుసల రోడ్డుతో పాటు డివైడర్‌ మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్‌ నిర్వహణ గడువు గత జూన్‌తో ముగియడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. జూలైలో రహదారిని పరిశీలించిన అధికారులు ఆగస్టులో ఎన్‌హెచ్‌ఏఐకి బదలాయిస్తూ గెజిట్‌ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం నాలుగు వరుసల రహదారి నిర్మించే వరకు స్వల్పకాలిక నిర్వహణ (షార్ట్‌ టర్మ్‌ మెయింటెనెన్స్‌) కింద కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉన్నా.. నేటి వరకు కేంద్రం నుంచి ప్రకటన వెలువడలేదు.

వెలగని లైట్లు

నిర్వహణ గడువు ముగియడంతో నెల రోజులుగా జాతీయ రహదారిపై గ్రామాల్లోని సెంట్రల్‌ లైటింగ్‌ వెలగడం లేదు. దాంతో రాత్రివేళల్లో రోడ్డు వెంట పూర్తిగా చీకటి మయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ గడువు ముగిసినందున ఇకపై గ్రామ పంచాయతీలే వీధి దీపాల నిర్వహణ చూసుకోవాలని హైవే అధికారులు చెబుతుండగా.. కరెంటు బిల్లుల భారం మోయలేమని, తమకు సంబంధం లేదని పంచాయతీలు చేతులెత్తేస్తున్నాయి. ఇరు విభాగాల మధ్య సమన్వయ లోపంతో రహదారిపై చీకట్లు కమ్ముకున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తేనే వీధి దీపాల బిల్లులు, రోడ్డు నిర్వహణ సమస్యకు తెరపడనుంది.

ఎన్‌హెచ్‌ఏఐ చేతికి

కోదాడ – జడ్చర్ల హైవే

గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం..

వారం రోజుల్లో బాధ్యతలు

ముగిసిన పాత కాంట్రాక్ట్‌ గడువు.. కొత్త టెండర్లపై జాప్యం

బిల్లుల పంచాయితీతో వెలగని

సెంట్రల్‌ లైటింగ్‌

నాలుగు లేన్లుగా విస్తరణకు అవకాశం

ఎన్‌హెచ్‌–167 మొత్తం పొడవు సుమారు 483 కిలోమీటర్లు, తెలంగాణ పరిధిలో 300 కిలోమీటర్లు ఉంది. ఇప్పటికే గూడెబల్లూరు నుంచి మహబూబ్‌నగర్‌ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయి భూసేకరణ సాగుతోంది. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వరకు, అనంతరం జడ్చర్ల నుంచి కోదాడ వరకు (234 కి.మీ.) నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ భారీగా పెరిగినందున త్వరలోనే ఫోర్‌ లేన్‌ రోడ్డుకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement