దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించాలి | - | Sakshi
Sakshi News home page

దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించాలి

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

సూర్యాపేట : పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయంగా పామ్‌ ఆయిల్‌ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా పామ్‌ ఆయిల్‌ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నెం సదాశివరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు నూనె దిగుమతి అయ్యే అవకాశం ఉండటంతో మన దేశంలో రైతులు పండించే పామ్‌ ఆయిల్‌ గెలల ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు.

యాదగిరి క్షేత్రంలో

విశేష పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు తొలుత సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సంప్రదాయంగా సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, సాయంత్రం ఆలయ తిరు మాఢ వీధుల్లో జోడు సేవలు జరిపించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు పవళింపు సేవ నిర్వహించారు.

ఎమ్మార్పీఎస్‌ జిల్లా

ఇన్‌చార్జిగా ముక్కంటి

హుజూర్‌నగర్‌ : ఎమ్మార్పీ ఎస్‌ జిల్లా ఇన్‌చార్జిగా హుజూ ర్‌నగర్‌కు చెందిన మేళ్లచెరువు ముక్కంటిని నియమించారు. ఈ సందర్భంగా ఆది వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘం జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింత బాబు అధ్యక్షతన శనివారం రాత్రి సూర్యాపేటలో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కె. మోహన్‌ తనకు నియామకపత్రం అందించినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మూసీకి

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ గరిష్ఠ స్థాయికి రెండు అడుగుల దూరంలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం మూసీ రిజర్వాయర్‌కు 1237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నీటిమట్టం 642.60 (గరిష్ట నీటిమట్టం645 అడుగులు)అడుగులకు చేరుకుంది. మూసీ కుడి ప్రధాన కాల్వకు 259 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 329 క్యూసెక్కుల చొప్పున మొత్తం 588 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 3.79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా

హుజూర్‌నగర్‌ : ఐదు రోజుల పనిదినాలతో పాటు పలు డిమాండ్‌ల సాధన కోసం ప్రభుత్వ బ్యాంక్‌ ఉద్యోగులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు చేయ తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నట్లు కెనరా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్టేట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ ఎ. రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసు నేపథ్యంలో ఐబీఏ, యూఎఫ్‌బీయూల మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి బ్యాంక్‌ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement