సూర్యాపేట టౌన్ : చదువుకున్న పాఠశాలతో అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా, దాని అభివృద్ధికి తోడ్పాటునందించడంలో పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమని ఎస్పీ నరసింహ, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ వార్షికోత్సవ సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ బడిలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు దేశ,విదేశాల్లో, వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగి పాఠశాలకు, సమాజానికి మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ప్రతిభ కనబరిచిన పలువురు పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కార్యదర్శి తాటి చంద్రశేఖర్, కన్వీనర్ డాక్టర్ వేణుధర్, పాఠశాల హెచ్‌ఎం గోలి పద్మ, విద్యాసాగర్, డాక్టర్ పటేల్ నరసింహారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, చిలువేరు రఘురాం, రాఘవాచారి, మహేందర్‌రెడ్డి, పెండెం రాములు తదితరులు పాల్గొన్నారు.


