ప్రతి ఏడాది నిర్వహించే ఇన్‌స్పైర్ మనక్‌తో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతతో పాటు మేథస్సుకు పదును పెట్టేందుకు వీలుంటుంది. తమకు రాదని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడం లేదు. అలాంటి అపోహలు వీడి అందరూ దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో 101 ప్రభుత్వ పాఠశాలల నుంచే దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15తో గడువు ముగియనుంది. వెంటనే అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలి.
–దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి
సూర్యాపేటటౌన్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌స్పైర్ మనక్‌కు ఈ ఏడాది జిల్లాలో ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు వినూత్న ఆలోచనతో రూపొందించే ప్రాజెక్టులతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇందుకు పాఠశాలలు, కళాశాలల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు.
గతేడాది కంటే తక్కువే..
ఇన్‌స్పైర్ మనక్‌కు జూలైలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా జిల్లాలో ఇప్పటి వరకు 373 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది మొత్తం 654 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 750 దరఖాస్తులు లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించగా అందులో సగం దరఖాస్తులే వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గడం విద్యాశాఖ, పాఠశాలల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇన్‌స్పైర్ మనక్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు గడువు మరో ఆరు రోజులే ఉంది.
ప్రోత్సాహం అవసరం
విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని శాసీ్త్రయ నమూనాలుగా అభివృద్ధి చేసేందుకు ఇన్‌న్‌స్పైర్ మనక్ దోహదపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించే ఈ కార్యక్రమంపై పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో, ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింత మంది దరఖాస్తు చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా వారిని ప్రోత్సహిస్తే జిల్లాకు మరిన్ని ఇన్‌స్పైర్ మనక్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.
ఎంపికై న వారికి రూ. 10వేలు
విద్యార్థి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టు నమూనా ప్రతిపాదన కూడా ఆన్‌లైన్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఎంపికై న ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ అవుతాయి. వీటితో విద్యార్థులు తమ ప్రాజెక్టును రూపొందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గతేడాది జిల్లా నుంచి 58 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి.
జిల్లాలో పాఠశాలల వివరాలు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు : 375
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు : 74
మోడల్ స్కూళ్లు : 09
కేజీబీవీలు : 18
ఇన్‌స్పైర్ మనక్ దరఖాస్తుల్లో కనిపించని పురోగతి
ఫ బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం కరువు
ఫ ఆసక్తి చూపని ప్రైవేటు పాఠశాలల
యాజమాన్యాలు
ఫ గతేడాది 654 దరఖాస్తులు
ఫ 15తో ముగియనున్న గడువు


