మునగాల: ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఈ నెల 13న ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. జూనియర్ బాలుర విభాగంలో 20 సంవత్సరాల లోపు, 75 కిలోల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికల విభాగంలో 16 ఏళ్ల లోపు వయస్సు, 55 కిలోలలోపు బరువు కలిగి ఉండాలని సూచించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు, టెన్త్ మెమో జిరాక్స్‌ను వెంట తీసుకొని రావాలని, వివరాలకు సెల్ : 9573962957, 9704095937 నంబర్లను సంప్రదించాలని కోరారు.
అర్హులైన ప్రతి
పౌరుడికి ఓటు హక్కు
తుంగతుర్తి : అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 50 వేల ఓటర్లకుపైగా వివరాలు సరిగా లేకపోవడంతో నోటీసులు అందించినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 13 పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించి వివరాలను సరి చేసుకోవాలని సూచించారు. నవంబర్ 5 వరకు వివరాలను సరి చేసుకోవాలని. నవంబర్ 9న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ దయానందం పాల్గొన్నారు.
శివపార్వతుల కల్యాణం
మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి క్షేత్రంలో గల శివాలయంలో బుధవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని, శ్రీవల్లీ, దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణోత్సవం అనంతరం మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతి, అర్చకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వా మి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
ఉచితంగా పోలీస్
ఫిజికల్ ట్రైనింగ్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీస్ ఉద్యోగార్థులకు ఉచితంగా ఫిజకల్ ఈవెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు సెంటర్ నిర్వాహకుడు ఎక్స్ ఆర్మీ కొండోజు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని పేర్కొ న్నారు. ఆసక్తి గల వారు సెంటర్‌ను లేదా 9010471756 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


