భానుపురి (సూర్యాపేట) : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, వీబీజీ రాం జీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీబీజీ రాం జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు నిరంతరం పని కల్పించాలని, ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ.300 ఉపాధి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకం కింద మంజూరైన ఇందిరమ్మ మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన పేమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితో పాటు డ్రెయిన్ ఎండ్ సోక్ పిట్లు, వీఓ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వాన్ని ప్రదర్శించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఈసీలపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ డి.శిరీష, డీపీఓ యాదగిరి. ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ 16 మంది పంచాయతీ
కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
ఫ ముగ్గురు ఉపాధి సిబ్బందిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం


