మేళ్లచెరువులో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు అనుమతి | - | Sakshi
Sakshi News home page

మేళ్లచెరువులో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు అనుమతి

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

మేళ్లచెరువు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతి లభించినట్లు పాఠశాల హెచ్‌ఎం పొనగండ్ల నారపరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 73 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు గాను నిధులు, పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మేళ్లచెరువు పాఠశాలలో వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ. 9.95 కోట్లు మంజూరైనట్లు హెచ్‌ఎం తెలిపారు.

శివాలయంలో

ప్రత్యేక పూజలు

మేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన, గోపూజ నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

19న కోదాడలో

మెగా జాబ్‌మేళా

కోదాడ: ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీరెడ్డి కాన్వెంట్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళాకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సమావేశం ఈ నెల 10న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతుందని మంత్రి తెలిపారు. కమిటీలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎర్నేని కుసుమ, వైస్‌చైర్మన్‌ మల్లీశ్వరి, ఫ్లోర్‌ లీడర్‌ కందుల కోటేశ్వరరావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంత నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యుత్‌ శాఖ నూతన ఎస్‌ఈగా యాదగిరి

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా విద్యుత్‌ శాఖ నూతన సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పెరికేటి యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ నుంచి బదిలీపై వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్‌ శాఖ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన ఎస్‌ఈని ఘనంగా సన్మానించారు. అసోసియేషన్‌ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్‌ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బ్రహ్మేంద్రరావు, కంపెనీ సెక్రటరీ బొబ్బిలి మురళి, జిల్లా అధ్యక్షుడు గుండు పరుశురాం, కార్యదర్శి బెల్లంకొండ భరత్‌ కుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఉపేందర్‌, డివిజన్‌ కార్యదర్శి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డిప్యూటీ

ఆర్‌ఎంగా నరసింహ

రామగిరి(నల్లగొండ) : టీజీఎస్‌ఆర్‌టీసీ నల్లగొండ రీజియన్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌గా (ఆపరేషన్స్‌ అండ్‌ మెకానికల్‌) నరసింహ, నల్లగొండ డిపో మేనేజర్‌గా మేరీ లావణ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్‌ఎం నరసింహ మాట్లాడుతూ నల్లగొండ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ రీజియన్‌ను ప్రగతి పథంలో రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement