ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారి 2010లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండానే వాటి పాలనను 2014 వరకు పొడిగించారు. ప్రత్యేక రాష్ట్రంలో చిన్న నీటి పారుదల వ్యవస్థలు, చెరువులు, జలాశయాలు డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులే వీటి నిర్వహణ బాధ్యతలు చూడడంతో రైతుల ప్రమేయం లేకుండా పోయింది. దాంతో జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, చెరువుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి.
భానుపురి (సూర్యాపేట) : చెరువులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్వహణ బాధ్యతలు చూసే సాగునీటి సంఘాల పునరుద్ధరణపై అయోమయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వీటి నిర్వహణ బాధ్యతలకు నిధులు సైతం విడుదల చేసేవారు. క్షేత్రస్థాయిలో ఉండే రైతులే వీటి బాధ్యతలను నిర్వహించడంతో సమస్యలు పరిష్కారమయ్యేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి సంఘాలను తొలగించి ఇరిగేషన్ శాఖలో విలీనం చేయడంతో తిరిగి సమస్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వగా.. ఈ మేరకు ఇటీవల రైతు కమిషన్ సీఎం రేవంత్‌రెడ్డికి సైతం విన్నవించింది. దాంతో తిరిగి సాగునీటి సంఘాల పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
గతంలో 100కు పైగా సంఘాలు
జిల్లాలో 1100కు పైగా చెరువులు, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ కాలువలతో పాటు కొంత ఆయకట్టు కలుపుకొని 100కు పైగా సాగునీటి సంఘాలు ఉండేవి. ఈ పదేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సాగయ్యే ఆయకట్టు కూడా భారీగా పెరిగింది. రైతుల సంఖ్య కూడా 2.80 లక్షల వరకు ఉంది. గతంలో ఉన్న సాగునీటి సంఘాలకు తోడుగా కొత్తగా సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
పునరుద్ధరించాలని సూచన..
సాగునీటి సంఘాలను తిరిగి పునరుద్ధరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కష్టాలు చాలా వరకు తీరుతాయని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన కమిషన్ తమ అధ్యయనంలో దృష్టికి వచ్చిన సమస్యలతోపాటు వాటి పరిష్కారానికి చేయాల్సిన వాటిని సైతం వివరించింది. ఈ సూచనలు అమలు చేస్తే తిరిగి సాగునీటి సంఘాలు మనుగడలోకి రానున్నాయి. దాంతో రైతులు సభ్యులుగా ఉండే సంఘాలు, అధికారులు సమన్వయంతో జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన సాగునీటి వ్యవస్థలను గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
ఫ ఎన్నికలు లేక నిస్తేజంగా
సాగునీటి సంఘాలు
ఫ మరమ్మతుకు నోచక అస్తవ్యస్తంగా కాలువలు, చెరువులు
ఫ పునరుద్ధరించాలని
రైతు కమిషన్ సిఫారసు


