ఫ మర్రికుంట బ్రిడ్జిపై ఆగిన లారీ
ఫ గంటపాటు ట్రాఫిక్‌జామ్
గరిడేపల్లి : మండలంలోని మర్రికుంట బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పురాతన బ్రిడ్జి కావడం, ఇరుకుగా ఉండడం, భారీ వాహనాలు సైతం ఈ బ్రిడ్జ్జి మీది నుంచే వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఆదివారం మర్రికుంట బ్రిడ్జిపై వెళ్తున్న లారీ మరమ్మతులకు గురై మధ్యలో ఆగిపోయింది. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో నిలిచిపోయిన లారీ పక్క నుంచి మరో వాహనం వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దాంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోవడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా ప్రయాణించే వారు సైతం గంటపాటు నిరీక్షించాల్సి వచ్చింది. బ్రిడ్జ్జిపై నిత్యం ఇలాంటి పరిస్థితే నెలకొంటున్నది. రాకపోకలకు కీలక మార్గంలో ఉన్న మర్రికుంట బ్రిడ్జి స్థానంలో విశాలమైన నూతన బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.


