సూర్యాపేట అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం, హింస, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్‌లో నిర్వహించిన ఏఐపీఎస్‌ఓ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాల వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయుధ పోటీకి, యుద్ధాలకు వెచ్చిస్తున్న భారీ నిధులను ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు తొగిట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు అనంతల మల్లేశ్వరి, సహాయ కార్యదర్శి సారెడ్డి వెంకట్‌రెడ్డి, గాలి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


