హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెం శివారులో సాగర్ ఎడమ కాలువకు గండి పడలేదని నీటిపారుదల శాఖ డీఈలు రామకృష్ణ, వెంకటేశ్వర్లు తెలిపారు. కాలువకు గండి పడినట్లు, కాలువ కట్ట తెగినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై వారు స్పందించి శనివారం సదరు కాలువ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది గండి కాదని, కరక్కాయలగూడెం శివారులో యూటీ వద్ద చిన్న రంధ్రం ఉందని తెలిపారు. దాని ద్వారా వచ్చే లీకేజీ నీటితో రైతులు చెరువులు నింపుకుంటున్నారని వారు తెలిపారు. కాలువలో నీరు తగ్గిన తర్వాత ఆ రంధ్రాన్ని పూడ్చివేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల ఏఈ మానస, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


