సూర్యాపేట : బీజేపీ పార్టీ కార్యాలయం, నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం, నల్లగొండలో నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రశ్నించే వారిని భయపెట్టేందుకు దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని పేర్కొన్నారు.
సైబర్ బాధితులకు
అండగా పోలీస్‌శాఖ
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీస్ సైబర్ వారియర్స్‌కు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై వారికి సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పెట్టుబడులను ప్రజలు నమ్మవద్దని, అలాంటి పెట్టుబడులకు ఎలాంటి రక్షణ ఉండదన్నారు. పెట్టుబడి వెబ్‌సైట్లు, యాప్‌లు నకిలీవనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఖైదీల ఆరోగ్యంపై
శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం, ఆహారం, భద్రతపై జైలు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైల్‌ను ఆమె సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను తనిఖీ చేశారు. మధ్యహ్న భోజనాన్ని పరిశీలించారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని ఖైదీలు డీఎల్‌ఎస్‌ఏలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట డీఎల్‌ఎస్‌ఏ సూపరిండెంట్ పద్మజ, జైలు సిబ్బంది ఉన్నారు.
జిల్లా స్థాయి సైన్స్
డ్రామా పోటీలు
సూర్యాపేటటౌన్ : జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన డ్రామాలు ఆకట్టుకున్నాయి. ‘శాస్త్రం –సమాజం’ ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన పోటీల్లో కృత్రిమ మేథస్సు – స్నేహితుడా, సాధనమా ముప్పా, విద్యుత్ వాహనాలు – భవిష్యత్ వైపు ముందడుగు, అంతరిక్ష నివాసాలు, సముద్రాల పునరుద్ధరణ – భవిష్యత్ తరాల పరిరక్షణ అనే ఉప అంశాలపై విద్యార్థులు నాటికలను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, కె.సత్యనారాయణసింగ్ పాల్గొన్నారు.


