భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో ‘సర్’ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారంలో చిన్న పాటి తప్పులు ఉన్నా సరే అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ నోటీసులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లకు అందలేదు. నోటీసులు అందుకున్న వారు సైతం ఏ తప్పులకు.. ఏ ఆధారం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులు సైతం అవగాహన కల్పించకపోవడం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
అందని నోటీసులు..!
జిల్లా వ్యాప్తంగా సర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ తర్వాత 9,11,945 మంది ఓటర్లకు ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కింది. ఈ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లతో పాటు అనామలీస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) కింద 1,90,676 మందికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. గత నెల 27న జిల్లాలో చేపట్టిన గ్రామ, వార్డు సభలలో 4,796 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా మిగతా వారికి సైతం నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. నోటీసులు జారీ అయిన చాలా మందికి బీఎల్‌ఓలు నోటీసులు అందించలేదని తెలుస్తోంది. తమ పేరు నోటీసుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుసుకున్న కొందరు ఓటర్లు తమకు ఇంకా నోటీసులు రాలేదంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అవగాహన లేని ఓటర్లు తాము ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చామని, ముసాయిదా జాబితాలో తమ పేరు ఉన్నందున తమ ఓటు ఎటూ పోదన్న భరోసాతో ఉన్నారు.
సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక..
ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు జారీ తర్వాత అంతగా పట్టించుకోవడం లేదు. చాలామందికి అక్షర దోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు వంటి చిన్న చిన్న కారణాలు ఉన్నప్పటికీ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాటిని ఎలా సరిచేయాలి, ఏ యే పత్రాలు సమర్పించాలన్న దానిపై ఓటర్లకు స్పష్టత లేదు. వాటిపై అధికారులు సైతం అవగాహన కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా అసలు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఓటర్లు ఏం చేయాలి, ఏ యే పత్రాలు సమర్పించాలి, విచారణకు ఎక్కడికి హాజరు కావాలనే విషయం కూడా చాలా మంది ఓటర్లకు తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఓటర్లు మరింత అభద్రతా భావంతో ఉన్నారు. వీరందరికీ అవగాహన కల్పించడంతో పాటు, నోటీసులను సకాలంలో ఓటర్లకు అందించడంతో పాటు వాటికి సరైన ఆధారాలు సమర్పించేలా జిల్లా యంత్రాంగం అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఫ చిన్నపాటి తప్పులున్నప్పటికీ
ఓటర్లకు నోటీసులు
ఫ వచ్చిన నోటీసులకు
సమాధానం ఎలా చెప్పాలో
తెలియక అయోమయం
ఫ నోటీసులు వచ్చినా ఓటర్ల
వరకు చేరని వైనం
ఫ గ్రామీణ ప్రాంతాల్లో
ఓటర్లకు అవగాహన కరువు


