సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, వ్యవసాయ సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కేసీఆర్ ప్రస్తావన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క సమావేశమైనా నిర్వహించారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అత్యధికంగా తలుచుకునేది రేవంత్‌రెడ్డే అన్నారు. నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు నెలకొన్నా స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని అడిగే ఎమ్మెల్యే కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. పల్లెల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మిర్యాలగూడలో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


