సాగునీటికి ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి ఉద్యమం

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

గేట్లను బద్దలు కొట్టైనా సాగునీటిని తీసుకుంటాం..

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని సాగు భూములకు సాగునీటి విడుదల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా వెలుగొందిందని, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా పేరుగాంచిన మిర్యాలగూడ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రా ప్రాంతం వారు నీటిని తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఆయకట్టు రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా మిగిలిపోయారన్నారు. సాగునీటి విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసేది లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతు మహా ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని, అయినా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీళ్లిస్తే రైతులు ఆనందంగా పండించుకున్నారని, అలాంటి ఇప్పుడు ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, నాగార్జునసాగర్‌, నల్లగొండ, నకిరేకల్‌ తదితర ఎడమ కాలువ పరిధిలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

బీఆర్‌ఎస్‌లో జోష్‌..

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంప్‌గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు మహా ధర్నా విజయవంతమైంది. పట్టణంలోని సాగర్‌రోడ్డు, నల్లగొండ రోడ్డు, కోదాడ రోడ్డు గులాబీ శ్రేణులతో నిండిపోయింది. నాయకులు ఊహించిన దానికంటే అధికంగా రైతులు, గులాబీ శ్రేణులు తరలిరావడంతో మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ పార్టీలో జోష్‌ వచ్చింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సాయంత్రం 4.30గంటలకు హనుమాన్‌పేట ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకోగా వేలాది మంది పలు వాహనాల్లో వచ్చి స్వాగతం పలికి ర్యాలిగా ఎన్‌ఎస్పీ క్యాంప్‌ గ్రౌండ్‌ వరకు చేరుకున్నారు. కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ ప్రజలు, రైతులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, నోముల భగత్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దుర్గంపూడి నారాయణరెడ్డి, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కడారి అంజయ్య, ఎండి.యూసుఫ్‌, నిమ్మల నవీన్‌రెడ్డి, ధనావత్‌ చిట్టిబాబునాయక్‌, ఫహీమొద్దిన్‌, ఇలియాస్‌,మట్టపల్లి సైదులుయాదవ్‌, నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, హాతీరాంనాయక్‌, ఎండి.షోయబ్‌, మల్లయ్యయాదవ్‌, రాములుగౌడ్‌, మగ్ధుంపాషా, షహనాజ్‌బేగం పాల్గొన్నారు.

ఫ సాగర్‌ నీటి విడుదల కోసం పోరాటం చేస్తాం

ఫ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణ’.. ఇప్పుడు ఎడారిగా మారింది

ఫ నల్లగొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు

ఫ సాగునీరు తరలించుకుపోతున్నా పట్టించుకోవట్లేదు

ఫ రైతు మహాధర్నాలో కేటీఆర్‌

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌ గేట్లను బద్దలు కొటైనా నీటిని తీసుకుంటామన్నారు. కృష్ణా జలాల హక్కుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని 17 పర్యాయాలు రైతుల శ్రేయస్సు కోసం నీటిని విడుదల చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో సాగర్‌ ప్రాజెక్టులో తక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పటికీ సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. జిల్లాలో ఉన్న మంత్రులు పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారే తప్ప రైతుల గోసను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి కళ్ల ముందే నీరు తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మిర్యాలగూడలో మహా ధర్నా జరుగుతుందనే విషయం తెలుసుకోని ప్రభుత్వం ముందస్తుగా నీటిని విడుదల చేశారని చెప్పారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేసిన నిరసన దీక్ష.. నీటి విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ల ముందు చేస్తే బాగుండేదన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా నియోజకవర్గంలో ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించామని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని వీర్లపాలెంలో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement