భానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఏసీబీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వరుసగా పట్టుబడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా, గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు సైతం ఏసీబీకి చిక్కుతుండడం గమనార్హం. తాజాగా సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారిగా, కోదాడ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న సోమయ్య ఏసీబీకి చిక్కడం జిల్లాలోని అవినీతి, అక్రమ వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏ శాఖలోనైనా, ఏ పనైనా చేయాలంటే చేయి తడపనిదే కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న అనుమతులకు సైతం అధికారులు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడం, డబ్బులు ఇస్తేనే ఫైలు ముందుకు కదల్చడంతో బాధితులు తీవ్ర విసుగు చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు, మూడేళ్లుగా ఏసీబీ అధికారులు లంచగొండుల ఆటకట్టిస్తున్నప్పటికీ, అధికారుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదు.
ఏసీబీకి పట్టుబడిన వారి వివరాలు..
ఫ తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఒక బియ్యం వ్యాపారి పేరును కేసు నుంచి తొలగించడానికి రూ.70 వేలు లంచం తీసుకుంటూ 2025 జనవరి 28న తిరుమలగిరి ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీకి దొరికారు.
ఫ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో రేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 2025 ఏప్రిల్ 9న అప్పటి ఎస్‌ఐ అంతిరెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఫ సూర్యాపేట జిల్లా భూగర్భ జల శాఖ అధికారి బాలు, ఒక బోరుబండి యజమాని నుంచి అనుమతి పత్రాల కోసం రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 2025 జూలై 15న కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి (డేటా ఎంట్రీ ఆపరేటర్) వెంకటేశ్వర్లు ద్వారా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
సోమయ్యపై గతంలో పలు ఆరోపణలు
తిరుమలగిరి (తుంగతుర్తి): ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య తిరుమలగిరి మున్సిపాలిటీలో 2018 నుంచి 2023 వరకు ఇన్‌చార్జ్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేశారు. మున్సిపాలిటీలో పనిచేసిన కాలంలో ఆయన ప్రతి పనికి ఒక రేటు చొప్పున లంచాలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నూతనంగా వేసిన వెంచర్లలో ప్లాట్‌ను బట్టి వసూళ్లకు పాల్ప డినట్లు సమాచారం. మున్సిపాలిటీలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని మధ్యవర్తులుగా పెట్టుకొని డబ్బులు దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నూతన వెంచర్లలో ఎకరానికి ఇంత అని లెక్కకట్టి వసూలు చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వని పక్షంలో తనకు తెలిసిన వ్యక్తుల పేరిట ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
విధులకు మున్సిపల్ అధికారులు డుమ్మా
కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో ఇన్‌చార్జ్ టీపీఓగా పనిచేస్తున్న సోమయ్య గురువారం సూర్యాపేటలో ఏసీబీ అధికారులకు చిక్కడంతో భయపడిపోయిన కోదాడ మున్సిపల్ అధికారులు ఉదయం 11 గంటల వరకు కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా సోమయ్యతో సంబంధం ఉన్న టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ సెక్షన్ అధికారులు విధులకు రాకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం తర్వాత కొంతమంది అధికారులు నెమ్మదిగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఏసీబీకి పట్టుబడిన టీపీఓ సోమయ్య
ఫ ఏసీబీకి వరుసగా చిక్కుతున్న అధికారులు
ఫ లంచం ఇవ్వనిదే పని కావడం
లేదని గగ్గోలు పెడుతున్న ప్రజలు


