అర్హతలు ఇవే....
బీసీ మహిళలకు ఉచితంగా పంపిణీకి నిర్ణయం
ఫ స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకం
ఫ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయింపు
ఫ 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు
నాగారం : మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అర్హులైన మహిళలకు తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బీసీ మహిళల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మహిళల స్వయం ఉపాధికి..
కుట్టు మిషన్ల ద్వారా బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే టైలరింగ్ చేసి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు సెర్ప్, మెప్మా, ఇతర శిక్షణ సంస్థల ద్వారా కుట్టు మిషన్ పనిలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమేటిక్ మిషన్లతో పనిభారం తగ్గి మహిళలకు మేలు చేకూరనుంది. అర్హులైన బీసీ మహిళలు ఈనెల 15వ తేదీ లోపు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు ఎంపీడీఓలకు, పట్టణ వాసులు మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలి.
మండలస్థాయి కమిటీలు..
ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందజేస్తారు.
నాలుగు వేల మందికి కుట్టు మిషన్లు...
ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అం దించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది చొప్పున మొత్తం నాలుగు వేల మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు.
ఫ దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అయి ఉండాలి.
ఫ 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఫ నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
ఫ కనీస అక్షరాస్యత తప్పనిసరి. 5వ తరగతి పాసైన వారికి అవకాశం.
ఫ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
ఫ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ఫ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఫ 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధిపొందిన వారు అర్హులు కారు.


