భానుపురి (సూర్యాపేట) : మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు జాతీయ కార్యాచరణ పథకం కింద జిల్లాలో 2026–27 సంవత్సవానికి జిల్లా డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత కలిగిన స్వచ్ఛంద, ప్రభుత్వేతర సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం కలెక్టరేట్‌లో సంప్రదించాలని కోరారు.
ఆడిట్ అధికారుల విచారణ
మఠంపల్లి : మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై బుధవారం ఆడిట్ అధికారులు (విజిలెన్స్ విభాగం) విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ ఆడిటర్ రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో అక్రమంగా నిధులు డ్రా చేశారంటూ వస్తున్న ఆరోపణలపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ రికార్డులను తనిఖీలు చేశామని, పూర్తిస్తాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఆడిట్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ సుమంత్‌రెడ్డి, ఎంపీఓ జగదీష్, సూపరింటెండెంట్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి దండుమైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవాలు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గణపతి పూజ, వేదపఠనం, గోపూజ, 4న కళాశాలభిషేకం, హోమాలు, కుంభస్థాపన, 5న దండు మైసమ్మ దీక్ష విరమణ, చివరి రోజు 6న బోనాల సమర్పణ, అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆలయ వార్షిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


