సూర్యాపేట : బుల్లెట్ రైలు పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించే వరకు పోరాటం ఆగదని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 17వ రోజు కొనసాగాయి. దీక్షలో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్యలో ఉన్న సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రైలు మార్గం లేకుండా పోతుందన్నారు. కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్‌ను సూర్యాపేట మీదుగా కాకుండా పక్కదోవ పట్టిస్తున్న పాలకులపై పోరాటం నిర్వహిస్తమన్నారు. దీక్షలో అంగన్‌వాడీ సిబ్బంది భాస్కరమ్మ, వసంత, ఏకలక్ష్మి, సంతోషకుమారి, వెలుగు వనిత, తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు అఖిలపక్ష నాయకులు రమణాచారి, ధర్మార్జున్, డేవిడ్ కుమార్, సీఐటీయూ నాయకులు కోటగిరి వెంకటనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, జీడి భిక్షం, నవిలే ఉపేందర్, విద్యాసాగర్ రావు, నారబోయిన వెంకట్‌యాదవ్, యాదయ్య, సట్టు నాగయ్య సంఘీభావం తెలిపారు.
బుల్లెట్ రైలు సాధనకు కొనసాగుతున్న రిలే దీక్షలు


