● రెండు రోజుల్లో రూ.4.93 కోట్ల ఆదాయం
రామగిరి(నల్లగొండ): రాఖీ పండుగ ఆర్టీసీకి అధిక ఆదాయం తెచ్చిపెట్టింది. నల్లగొండ రీజియన్‌లో ఏడు డిపోల ద్వారా నడిపిన ప్రత్యేక బస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పండుగ ప్రయాణాలను సురక్షితంగా, సులభతరం చేసేందుకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేగా, ఆయా మార్గాల్లో రద్దీ పెరిగి ఆర్టీసీకి బంపర్ కలెక్షన్లు సమకూరాయి. ఈ నెల 27, 28 తేదీలలో ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది. ఏడు డిపోల నుంచి పండుగ ముందు రోజు 27న రూ.2,05,96,310 ఆదాయం రాగా.. పండుగ రోజు 28న రూ.2,87,43,647 వచ్చాయి. గత సంవత్సరం రాఖీ పండుగ కంటే ఈసారి రాబడి గణనీయంగా పెరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రాఖీకి రూ.45 లక్షలు ఎక్కువ వచ్చాయి.
రాష్ట్రంలోనే నల్లగొండ రీజియన్ టాప్
పండుగ రోజు వచ్చిన ఆదాయం, ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా నల్లగొండ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియో 147.44%గా నమోదైంది. నల్లగొండ రీజియన్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలను నిర్వహించడం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను అందుబాటులో ఉంచడం వల్లనే ఈ స్థాయిలో ఫలితాలు సాధించగలిగామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.


