సూర్యాపేటటౌన్ : సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ నరసింహ అన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్‌న్‌ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారం అత్యంత కీలకమైనదన్నారు. ఈ వాహనం ద్వారా ఘటనా స్థలం నుంచే నేరుగా ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా సేకరించవచ్చన్నారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా గుర్తించవచ్చని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్‌ఎస్‌ఐలు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం పాల్గొన్నారు.


