మూతబడ్డ మిల్లుకు ధాన్యం కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

మూతబడ్డ మిల్లుకు ధాన్యం కేటాయింపు

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

కోదాడ: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎంఆర్‌) ధాన్యాన్ని ఓ రైస్‌ మిల్లర్‌ అక్రమంగా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొన్నాడు. రూ.13.5 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నాడు. రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు సోమవారం రాత్రి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ భారీ అక్రమాలు వెలుగు చూసింది. నల్లగొండ నుంచి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు కోదాడ నుంచి హుజూర్‌నగర్‌ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి రైస్‌ కార్పోరేషన్‌ మిల్లుపై దాడులు నిర్వహించి భారీగా ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ మిల్లును రంగనాయక రైస్‌ కార్పోరేషన్‌ పేరుతో మేళ్లచెరువు శంకర్రావు అనే వ్యాపారి కాంట్రాక్ట్‌కు తీసుకొని నడిపిస్తున్నట్లు రికార్డులలో నమోదైంది. సదరు వ్యాపారి ధాన్యం పక్కదారి పట్టించాడని అధికారులు తేల్చారు.

ధాన్యం మాయం చేసినా..

సీఎంఆర్‌ ధాన్యం బకాయిలున్న మిల్లులకు కొత్తగా ధాన్యం కేటాయించేది లేదని అధికారులు చెబుతున్నారు. అయినా కొంతమంది అధికారులు మిల్లర్లతో ములాఖాత్‌ అవుతూ మళ్లీ వారికే భారీగా ఽసీఎంఆర్‌ ధాన్యం కేటాయిస్తున్నారు. కోదాడలోని విజయలక్ష్మిరైస్‌ కార్పోరేషన్‌ మిల్లుకే కేటాయింపులు చూస్తుంటే ఈ విషయం వెలుగులోకి వస్తున్నది. రంగనాయక రైస్‌మిల్లు పేరుతో దీనిని లీజుకు తీసుకున్న వ్యాపారి మూడేళ్లుగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ మిల్లు 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన రూ.3.35 కోట్ల విలువైన ధాన్యాన్ని (1499.480 టన్నులు) యజమాని మాయం చేశాడు. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా 2024–25 యాసంగి, 2025–26 వానకాలం సీజన్‌లకు సంబంధించి 3237.236 మెట్రిక్‌ టన్నుల ధాన్యం(దీని విలువ రు.10.16కోట్లు) కేటాయించారు. ఈ ధాన్యాన్ని సైతం సదరు మిల్లరు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నాడు. మూడు సీజన్‌లకు సంబంధించిన మొత్తం రూ.13.51 కోట్ల విలువైన ధాన్యాన్ని సదరు మిల్లర్‌ పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. దాంతో మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగు చూసిన ఘరానా మోసం

రూ.13.5 కోట్ల విలువైన

సీఎంఆర్‌ బియ్యం మాయం

అధికారుల నిర్లక్ష్యంతో

మూడేళ్లుగా కొనసాగుతున్న తంతు

పోలీసుల అదుపులో మిల్లు యజమాని

కేసు నమోదు చేశాం : డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టించాడని విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమాని మేళ్లచెరువు శంకర్‌రావుపై కేసు నమోదు చేశాము. అతడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోదాడ నుంచి హుజూర్‌నగర్‌ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి రైస్‌ మిల్లు. పూర్తిగా పాడుపడి పనిచేయని స్థితిలో ఉన్న ఈ మిల్లును కోదాడకు చెందిన ధాన్యం వ్యాపారి మేళ్లచెరువు శంకర్‌రావు లీజుకు తీసుకొని రంగనాయక రైస్‌ మిల్లు పేరుతో సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపు చేసుకుంటున్నాడు. అధికారులు మిల్లును పరిశీలించకుండానే మూడు సంవత్సరాలుగా ధాన్యం కేటాయిస్తున్నారే గానీ ఇప్పటి వరకు కేజీ బియ్యం కూడ వెనక్కి తీసుకోలేదు. మిల్లు యజమాని 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.3.35 కోట్ల విలువైన సీఎంఆర్‌ బకాయి ఉన్నప్పటికీ 2024–25, 2025–26 సంవత్సరాలకు గానూ రూ.10 కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement