సూర్యాపేట : సుధా బ్యాంకు అత్యుత్తమ నిర్వహణ, పనితీరు ఆధారంగా అంతర్జాతీయ హై క్వాలిటీ హైమ్ రేటింగ్ సంస్థ 5స్టార్ రేటింగ్ పురస్కారం ప్రకటించినట్లు సుధాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం త్రివేణి గార్డెన్‌లో సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరవుతారని తెలిపారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
కోదాడరూరల్ : బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 26 ఏళ్లుగా రూ.300 కోట్ల టర్నోవర్‌తో తమ 9శాఖల ఖాతాదారులకు నమ్మకంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా బంగారం, గృహ, వ్యాపార , వ్యక్తిగత రుణాలను తక్కువ వడ్డీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, డైరెక్టర్‌లు తోట శ్యామ్, స్వామి వెంకటేశ్వర్లు, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, వెంపటి వెంకటరమణ, బ్యాంకు మేనేజర్ చెన్నూరి రవికుమార్, సిబ్బంది ఉన్నారు.


