అర్వపల్లి : ప్రస్తుత యాసంగి సీజన్‌కు గాను జిల్లాకు వారబందీ విధానంలో గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పునరుద్ధరించారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 8న నీటిని వదలాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగు రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. తొలిరోజు జిల్లాకు 1,200 క్యూసెక్కుల నీటిని వదిలారు. గురువారం నీటిని పెంచనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
ఆత్మకూర్ (ఎస్) : మండలంలో వరిసాగు చేసిన రైతులు అరిగోస పెడుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వరిసాగు చేసిన రైతులు నిన్నటి వరకు యూరియా కోసం నానా తిప్పలు పడగా ఇప్పడు పంట చేతికొచ్చే సమయంలో నీళ్లందక తమ వరిపొలాలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభమై భూగర్భ జలాలు తగ్గడంతోపాటు శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నీళ్లు రాకపోవడంతో చేతికందేపంట కళ్లెదుటే ఎండిపోతుందని మండల రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
33 వేల ఎకరాల్లో వరిసాగు
మండల వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో 33 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రధానంగా బోరు బావులు చెరువుల ఆధారంతోపాటు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి వరిపంట సాగు చేపట్టారు. కాగా ఎస్సారెస్పీ నీరు సక్రమంగా రాకపోవడంతో రైతుల ఆశలు గల్లంతవుతున్నాయి.
వారబందీతో చివరికి చేరని నీరు
మండల వ్యాప్తంగా 69, 71 డీబీఎంలతోపాటు దాని ఉపకాల్వలు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీ నీరు మండలంలోని పలు గ్రామాలకు చేరడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం వారాబంధి ద్వారా సాగునీరు వదులుతుండటంతో మధ్యలోనే నీరు ఆగిపోతుందని తాము ఎస్సారెస్పీ నీటిని నమ్ముకొని సాగు చేయడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
పొట్ట దశలో వరిపొలాలు
మండలంలో సాగుచేసిన వరి పొలాలు ప్రస్తుతం పొట్ట దశలోకి వచ్చాయి. మరో 20 రోజులు నీటిని అందిస్తే పంట చేతికి వస్తుందని అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని ఎక్కువ మోతాదులో విడుదల చేయాలని మండల రైతులు కోరుతున్నారు.
ఫ ఎండుతున్న వరిపొలాలు
ఫ వారబందీ విధానంతో ఇబ్బందులు
ఫ ఆందోళనలో అన్నదాతలు


