యంత్రాలు వస్తున్నాయ్..
ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది
చిన్న, సన్నకారు రైతులకు సైతం ప్రయోజనం ఉండేలా..
భానుపురి (సూర్యాపేట) :భానుపురి (సూర్యాపేట) : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యవసాయ పరికరాలు త్వరలోనే అందనున్నాయి. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. యాంత్రీకరణ పథకానికి జిల్లాలో 2,462 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రూ.4.47 కోట్లు మంజూరు చేసింది. సంక్రాంతి వరకు రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
పెరుగుతున్న సాగు ఖర్చులు
రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ వైపు సాగా లన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించేవారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకం నిలిచిపోయింది. దీంతో రైతులు సొంతంగానే వ్యవసాయంలో అవసరమైన వివిధ రకాల పనిముట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పరికరాల ధరలు అమాంతంగా పెరగడంతో వీటి కొనుగోలు రైతులకు భారంగా మారింది. అంతేకాకుండా వరి సాగులో ఆధునాతనమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఖర్చుతో కూడుకోవడంతో వీటి ని సమకూర్చుకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. తద్వారా పెట్టుబడులు అధికమవుతున్నాయి.
ఎన్నికల కోడ్‌తో నిలిచిన ప్రక్రియ
నిలిచిన వ్యవసాయ సబ్సిడీ పరికరాలపై ఆశలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి ఏడాదే వివిధ రకాల పనిముట్లను అందించాలని చూసినా.. పలు కారణాలతో అమలు సాధ్యపడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రూపొందించిన ఈ పథకానికి రూ.4.47 కోట్లు విడుదలయ్యాయి. తొమ్మిది నెలల క్రితం రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ 17లోగా పరికరాలు రైతులకు అందించాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్‌తో ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
మంత్రి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
సంక్రాంతి వరకు రైతులకు యంత్ర పరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో పంపిణీ చేస్తాం.ఇందుకోసం ప్రభుత్వం రూ.4.47 కోట్లు మంజూరు చేసింది.
–శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
సంక్రాంతికి యాంత్రీకరణ పరికరాల పంపిణీకి సన్నాహాలు
ఫ జిల్లాలో 2,462 దరఖాస్తులు
ఫ రూ.4.47 కోట్లు విడుదల
మంజూరైన పరికరాలు ఇవీ..
పరికరం యూనిట్లు నిధులు
(రూ.లక్షల్లో)
బ్యాటరీ జమ్యానవల్ పంపులు 4,366 43.66
పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్
అండ్ పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ 647 64.70
రోటేవేటర్ 195 97.50
సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 46 13.80
కల్టివేటర్లు, ఇతర పరికరాలు 290 58.00
గట్లువేసే మిషన్ (పీటీఓ కానిది) 15 2.25
గట్లు వేసే మిషన్ (పీటీఓ) 20 30.00
పవర్ వీడర్ 25 8.75
బ్రష్ కట్టర్ 50 17.50
పవర్ టిల్లర్లు 33 33.00
మొక్కజొన్న షెల్లర్లు 20 20.00
స్ట్రా బేలర్లు 29 58.00
మొత్తం 5,736 447.16
గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద పెద్ద ట్రాక్టర్లు ఇచ్చేవారు. ఇవి పెద్ద రైతులకే ఉపయోగకరంగా ఉండేవి. చిన్న,సన్నకారు రైతులకు సైతం మేలు జరిగేలా యంత్రాలు ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగళ్లు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డికట్టలు కట్టే బేలార్ యంత్రాలు, రొటేవేటర్లు తదితర చిన్నచిన్న పరికరాలను సైతం అందించనుంది. జిల్లాకు వివిధ రకాల యూనిట్లు 5,736 మంజూరయ్యాయి.


