పేరుకే సీసీ రోడ్లు
కోదాడ: మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్న సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడంతో మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు మిషన్ భగీరథ పేరుతో సీసీ రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా వీటిని పూడ్చక పోవడంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. 35 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇటీవల నయానగర్‌వాసులు వినాయకచవితి చందా డబ్బులు మిగిలితే వాటితో రోడ్లపై గుంతలను పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
● మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాలకవర్గం లేకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో హడావుడిగా పట్టణంలో సీసీ రోడ్లు వేయించారు. నాణ్యత పాటించకపోవడం, ఇసుకకు బదులు డస్ట్ వాడడంతో కొద్దిరోజులకే పాడైపోయాయి. ఇంకా పలుచోట్ల సీసీ రోడ్లపై మళ్లీ సీసీ రోడ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వేసిన సీసీ రోడ్లు చెక్కు చెదరకుండా ఉండగా.. రెండు, మూడేళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయి. శివారు కాలనీలలో ఇప్పటికీ మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి.
● కూడళ్ల వద్ద డ్రెయిన్లు ఉన్న ప్రాంతాల్లో పద్ధతి ప్రకారం రోడ్లు నిర్మించకపోవడంతో గుంతలు పడి మురుగు నీరు బయటకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లకన్నా డ్రెయిన్లను ఎత్తులో నిర్మాణం చేయడంతో వర్షం వచ్చిన సమయంలో నీరు డ్రెయిన్‌లోకి వెళ్లకుండా రోడ్లపైకి వస్తుంది. దీంతో రహదారులు పాడైపోతున్నాయి.


