నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 11 నుంచి (నేడు) 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు డీఐఈఓ బానునాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కాలేజీలు నడపవద్దని, ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.
సూర్యక్షేత్రాన్ని సందర్శించిన రిటైర్డ్ ఎస్పీ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రాన్ని శనివారం రిటైర్డ్ ఎస్పీ రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు సన్మానించారు. రాజేంద్రప్రసాద్ గతంలో సూర్యాపేట జిల్లా ఎస్పీగా పని చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు రజితజనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
నృసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివా రం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. మూలవిరాట్‌కు పంచామృతాబిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని వధూవరులుగా దివ్యమనోహరంగా అలంకరించి ఎదుర్కోళ్లు నిర్వహించి, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణతంతు పూర్తి చేశారు. కల్యాణమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
గోదాదేవికి ప్రత్యేక పూజలు
ధనుర్మాసం సందర్భంగా మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుప్పావై సేవాకాలం, పాశురాలు, పారాయణాలు తదితర కైంకకర్యాలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మ ట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి : శ్రీరాంసాగర్ రెండోదశ పరిధిలో జిల్లాకు గోదావరి జలాలను పెంచారు. 1000 క్యూసెక్కుల నీళ్లు వదలగా శనివారం 1,510 క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని 69,70,71 డీబీఎంలకు పంపిణీ చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
గుట్టలో నిరాటోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి క్షేత్రంలో నిరా టోత్సవాలకు అర్చకులు శనివారం శ్రీకారం చుట్టారు. ఉదయం గోదాదేవిని అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీరంగనాథుడిని కొలుస్తూ పాశురాలు పఠించారు. మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాత్రి గోదాదేవి అమ్మవారి కల్యాణం ఉంటుందని అర్చకులు తెలిపారు.
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు


