క్షేమంగా.. గమ్యం చేరు
హైవే వెంట గ్రామాల ప్రజలు జాగ్రత్త
బ్లాక్ స్పాట్‌ల వద్ద పటిష్ట చర్యలు
అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన నంబర్లు
100, 8712686057, 8712686026
సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి. వాహనదారులు అతివేగం, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయొద్దు. విధిగా జాగ్రత్తలు పాటించాలి.. అని ఎస్పీ నరసింహ సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు.
వాహనాలు కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలి. చలి ప్రభావం, పొగమంచు ఉంటుంది. రాత్రి సమయంలో డ్రైవర్లకు అప్రమత్తత అవసరం.
అత్యవసర సమయంలో నేషనల్ హైవే అధికారులను లేదా డయల్ 100కు ఫోన్ చేసి సహాయం పొందాలి. రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు.
భారీ వాహనాలు ఒక క్రమంలో వెళ్లాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు.
జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై విస్తరణ పనులు, మరమ్మతులు జరుగుతున్నాయి. అవసరమైన చోట డైవర్షన్‌లు ఏర్పాటు చేసి గమనిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటిని పాటిస్తూ వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవారు నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా వెళ్లాలి.
రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లేవారు నకిరేకల్ వద్ద జాతీయ రహదారి వైపు తీసుకుని అర్వపల్లి, బంగ్లా, ఖమ్మం మీదుగా వెళ్లాలి.
రాజమండ్రి, విజయనగరం, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం వైపు వెల్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద నుంచి ఖమ్మం జాతీయ రహదారి వైపు మళ్లించాం.
ఖమ్మం నుంచి సూర్యాపేట వైపుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి సూర్యాపేట పట్టణం మార్గంలోకి మళ్లించి సూర్యాపేట పట్టణం మీదుగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చు.
జాతీయ రహదారిపై పోలీసు సిబ్బంది 24 గంటలు గస్తీ నిర్వహిస్తారు. సీఐల పర్యవేక్షణలో నిరంతరం పెట్రోలింగ్ ఉంటుంది.
రహదారి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళ్లినా, రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపినా కేసులు నమోదు చేస్తాం.
నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ నిరోధించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు జారీ చేశాం.
ఫ జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపవద్దు
ఫ డైవర్షన్ బోర్డులను గమనించండి
సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులకు ఎస్పీ నరసింహ సూచనలు
జాతీయ రహదారి వెంట గల సూర్యాపేట రూరల్, చివ్వెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు రాంగ్‌రూట్‌లో వాహనాలపై వెళ్లడంతో పాటు పశువులను తీసుకెళ్తుంటారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.
పండగకు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రహదారిపై పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నాం. ప్రధానంగా బ్లాక్ స్పాట్‌ల వద్ద ప్రమాదాలు సంభవించకుండా స్థానిక ప్రజలను అప్రమత్తం చేశాం. బ్లాక్ స్పాట్‌లు గుర్తించిన ప్రాంతాల్లో వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాం.


