మహిళా సమాఖ్యలకు భవనాలు
భానుపురి (సూర్యాపేట) : స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఊరూరా పక్కా భవనాలు నిర్మించాలని సంకల్పించిన ప్రభుత్వం.. తొలి విడతలో 175 భవనాలు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది.
579 గ్రామ సమాఖ్యలు
జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 16,809 స్వయం సహాయక సంఘాలు, 579 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. మొత్తం 1,69,976 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పొదుపు చేస్తూ, రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అయితే సమావేశాల నిర్వహణకు సొంత భవనాలు లేక సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గ్రామంలో శాశ్వత భవనం అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు మొదలయ్యాయి. స్థలాల గుర్తింపు కూడా పూర్తవడంతో గ్రామ సభల్లో పంచాయతీలు తీర్మానం చేయాల్సి ఉంది. తీర్మానాన్ని ఎంపీడీఓకు అందిస్తే, అక్కడి నుంచి జిల్లా గ్రామాభివృద్ధి అధికారికి, తర్వాత కలెక్టర్‌కు చేరుతుంది.
ఒక్కో భవనానికి రూ.10 లక్షలు
మహిళా సమాఖ్య భవనాలను మహాత్మాగాంధీ ఉపాధిహామీ నిధులతో నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు పోగా, మిగతావి కూలీలతో పనులు చేయించనున్నారు. భవనాన్ని 200 చదరపు గజాల్లో నిర్మించనున్నారు. 500 చదరపు అడుగుల్లో పెద్ద హాల్ ఉండనుంది. ఈ హాల్‌లో సమావేశాలు, శిక్షణలు జరిగేలా అనువుగా ఉండనుంది. అలాగే టాయిలెట్ నిర్మించనున్నారు. సంకాంత్రి పండుగ తర్వాత అనుమతులు వచ్చిన భవనాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.
మంజూరైన భవనాలు ఇలా..
తొలి విడతలో 175 మంజూరు
ఫ ఉపాధిహామీ నిధులతో నిర్మాణం
ఫ సంక్రాంతి తరువాత పనులు ప్రారంభం
మండలం భవనాలు
అనంతగిరి 05
గరిడేపల్లి 20
హుజూర్‌నగర్ 03
కోదాడ 06
మేళ్లచెర్వు 06
ఆత్మకూర్ (ఎస్) 22
చివ్వెంల 14
పెన్‌పహాడ్ 28
సూర్యాపేట 18
జాజిరెడ్డిగూడెం 08
మద్దిరాల 05
నాగారం 08
నూతనకల్ 14
తిరుమలగిరి 13
తుంగతుర్తి 05


