గాంధీ పేరు తొలగింపు అన్యాయం
భానుపురి (సూర్యాపేట) : మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం అన్యాయమని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. సూర్యాపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత గాంధీ పేరును తొలగించి, రాంజీ పేరు పెట్టడం.. ఉపాధిహామీ పథకం ఉద్దేశాన్ని దెబ్బ తీయడమేనన్నారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగా చేతినిండా పనికల్పించి వలసలను అరికట్టేందుకు అప్పటి యూపీఏ సర్కార్ ఉపాధిహామీ పథకాన్ని తీసుకురాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలని మార్పులు చేయడం వల్ల పథకం రాష్ట్రాలకు భారంగా మారి, రద్దు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్‌రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అంజలి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, ఎస్సీ సెల్ విభాగం వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు, అక్కినపల్లి జానయ్య, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, ధారవత్ రాగునాయక్, శబరి తదితరులు పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


