ఇళ్ల మధ్యనే మురుగు
స్నేహనగర్ కాలనీలో అంతర్గత రోడ్లు లేవు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్లన్నీ తవ్వి, తిరిగి పూడ్చకపోవడంతో కాలనీవాసులు నరకం చూస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లోకి మురుగు నీరు చేరి కుంటలను తలపిస్తోంది. జమ్మి పుట్టి దోమలు, విష పురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇక మిషన్ భగీరథ పైప్‌లైన్లు వేసినా కొన్ని చోట్ల నల్లాలు బిగించలేదు. కొత్తగా మళ్లీ పనులు చేపడుతున్నారు. డ్రెయినేజీలు ఉన్న చోట నిర్వహణ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తాచెదారం చేరి పూడుకుపోయాయి. వీధి దీపాలు కూడా సరిగా లేవని, ఉన్న చోట వెలగడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


