న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కోదాడ: పేదల సౌకర్యార్థం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆరు నెలల క్రితం రూ.4కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ మిషన్ నేటికీ మూలన పడి ఉంది. దీని నిర్వహణకు అవసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లు నియమించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విలువైన యంత్రం ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. సిటీస్కాన్ మిషన్ ప్రారంభించిన నాడు రూమ్‌కు వేసిన తాళం ఇప్పటికీ తీసిన దాఖలాలు లేవు. దీని నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని వైద్యశాల నిర్వాహకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా నియమాకం మాత్రం జరగడం లేదు. దీంతో పేదలు సిటీ స్కానింగ్ కోసం ఖమ్మం, సూర్యాపేటకు వెళ్లాల్సి వస్తోంది.
ఆరు నెలలుగా తీయని తాళం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోదాడ ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచారు. నూతన భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ రూ.4కోట్ల విలువైన సిటీ స్కానింగ్ మిషన్ మంజూరు చేసింది. దీనిని వైద్యశాలలో మూడు గదులను కూలగొట్టి కొత్తరూం నిర్మించి అందులో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేశారు. కానీ దీని నిర్వహణకు అసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లను మాత్రం నియమించలేదు.
యంత్రం పనిచేస్తుందా..
గడిచిన ఆరు నెలలుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసిన గదిపైన మరో రెండు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండడంతో దుమ్ము, ధూళి, సిమెంట్ గదిలోకి చేరి యంత్రం పాడైపోతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి సిటీస్కానింగ్ యంత్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
మహిళలను వేధిస్తే కేసులే : ఎస్పీ
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అవసాన దశలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని, గంజాయి, డ్రగ్స్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సామాజిక అంశాలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా 300 గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దన్నారు. సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహేశ్వర్, సర్పంచ్ నగేష్ పాల్గొన్నారు.
కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో
వృథాగా సిటీ స్కానింగ్ మిషన్
రేడియాలజిస్టులు, టెక్నీషియన్లను
నియమించకపోవడంతో
వినియోగంలోకి రాని యంత్రం


