కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం స్థానంలో ‘ముఖ గుర్తింపు హాజరు’ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ, 2 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో తరగతులకు డుమ్మా కొట్టడానికి వీలు లేకుండా పోతుంది. ఫైలెట్ ప్రాజెక్ట్‌గా మార్చి 15 నుంచి కొన్ని కళాశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. ఇది విజయవంతం కావడంతో అన్ని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి అమలులోకి తెచ్చారు.
ప్రత్యేక యాప్ రూపొందించిన విద్యాశాఖ
ఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పనిచేయకపోవడం, కృత్రిమ వేలిముద్రలు వాడడం వంటివి చేస్తుండడంతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్‌ఆర్‌సీ యాప్‌ను తీసుకువచ్చింది. ‘రెయింట్ ఏఐ సొల్యూషన్స్’ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ సాగుతోంది. అధ్యాపకులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు.
ఒక్కసారి నమోదు
అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి ఈ యాప్‌లో తమ పేరుతో పాటు ముఖాన్ని నమోదు చేసుకోవాలి. ఆ తరువాత యాప్ ద్వారా ప్రతిరోజు, ప్రతి పిరియడ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్‌ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ విధానం పూర్తవుతుంది. కాగా.. కళాశాల లొకేషన్‌లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. ఫోన్‌లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్‌లో నమోదవుతుంది. దీని ద్వారా ఎంతమంది అధ్యాపకులు, విద్యార్థులు కళాశాలలకు వచ్చారు? ఎంతమంది డుమ్మా కొట్టారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది.
హాజరు పట్టిక అవసరం లేదు
డిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలను ఉపయోగించాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్‌లో, రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగో సెమిస్టర్‌లో ఉండగా.. వీరికి యాప్‌ను ఉపయోగించి హాజరు నమోదు చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతో పాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేయనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో
అమల్లోకి వచ్చిన ఎఫ్‌ఆర్‌సీ
విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బందికి తప్పనిసరి
కళాశాల ప్రాంగణంలో ఉంటేనే
పనిచేసేలా సాఫ్ట్‌వేర్ రూపకల్పన
ప్రైవేట్ కళాశాలలకు
మినహాయింపుపై విమర్శలు
జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సగానికిపైగా విద్యార్థులు తరగతులకు రాకుండా నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా కళాశాలలు కూడా అధ్యాపకులను నియమించకుండా కేవలం ఉపకార వేతనాల కోసమే కళాశాలలను నడుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానం అమలు చేసి ప్రైవేట్ కళాశాలలను వదిలేస్తే తమకు అడ్మిషన్లు తగ్గిపోతాయని, ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఎఫ్‌ఆర్‌సీ విధానం అమలు చేయాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు పేర్కొంటున్నారు.


