అల్పాహారం 16 రోజులే..
ఒక్కో విద్యార్థికి రూ.15
ఉత్తమ ఫలితాలు సాధించాలి
సూర్యాపేటటౌన్ : పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందజేసేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు సాయంత్రం సమయంలో అల్పాహారం అందజేయనుంది. ఇందుకోసం రూ.10,80,615 విడుదల చేసింది.
3,539 మందికి..
జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఇతర రెసిడెన్షియల్స్ కాకుండా ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత పాఠశాలలు 170 ఉన్నాయి. ఇందులో 3,539 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. కాగా ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ రెండు విడతల కార్యాచరణ రూపొందించింది. మొదటి విడతలో భాగంగా అక్టోబర్ నెల నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ క్లాస్‌లతో పాటు ప్రతి రోజూ సాయంత్రం 4.15 నుంచి 5.15గంటల వరకు గంట పాటు డిసెంబర్ వరకు ఒక పూట ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం రెండో విడత కింద 52 రోజుల ప్రణాళిక తయారు చేసి ఈ నెల 1నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చే విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపులతో, సాయంత్రం ఆకలితో హాజరవుతూ ఇబ్బందులు పడుతున్నారు. స్నాక్స్ అందించాలని డిసెంబర్ నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అరకొరగా స్నాక్స్ అందిస్తున్నారు.
పరిమిత రోజులకే..
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం 19 రోజులు మాత్రమే అల్పాహారం అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది 38 రోజులకు అల్పాహారం అందించగా ఈ ఏడాది సగానికి కుదించారు. సుమారు నెల తర్వాత అల్పాహారం అమల్లోకి రానుంది. ఈ నెల రోజులు అర్ధాకలితోనే విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటి నుంచే అల్పాహారం అందిస్తే బాగుండేదని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,539 మంది టెన్త్ విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రూ.15 చొప్పున రూ.10,80,615 విడుదలయ్యాయి. ఈ నిధులతో పోషక విలువలతో కూడిన చిరుతిళ్లను విద్యార్థులకు అందించనున్నారు. ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు, బెల్లం వంటి పోషకాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి వంటివి రోజుకో రకం చొప్పున అందించనున్నారు.
ఫ టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్
ఫ రూ.10,80,615 విడుదల చేసిన
రాష్ట్ర విద్యాశాఖ
ఫ గత సంవత్సరంతో పోలిస్తే సగం రోజులకు తగ్గింపు
టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు అల్పాహారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. 3,539 మంది విద్యార్థులకు రూ. 10,80,615 విడుదలయ్యాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలి. –అశోక్, డీఈఓ
అల్పాహారం 16 రోజులే..


