గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం
అధికారుల విచిత్ర ధోరణి
కోదాడ పెద్దచెరువు ఆక్రమణదారులకు నోటీసులు
ఫ వారం రోజుల్లోగా సంజాయిషీ
ఇవ్వాలని ఆదేశం
ఫ 372 మంది కబ్జాదారులను
గుర్తించిన అధికార యంత్రాంగం
ఫ కబ్జా స్థలాల్లో వెలసిన అపార్టుమెంట్లు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలు
కోదాడ : కోదాడ పెద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి సీరియస్ అయ్యింది. పెద్దచెరువు ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై సుమోటోగా (కేసు నెం:125/2023) కేసు నమోదు చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, చైన్నె (సౌత్‌జోన్) ఆక్రమణదారులకు తాజాగా నోటీసులు జారీచేసింది. వీరంతా నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొంది. గతేడాది దీనిపై రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదలశాఖ అధికారులతో సంయుక్త సర్వే చేయించారు. రిపోర్టు ప్రకారం చెరువులో ఉన్న శిఖం, ఎఫ్‌టీఎల్, ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో 372 మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి వీరందరికి నోటీసులు జారీచేశారు. అయితే ఆక్రమించుకున్న స్థలంలో అపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు, కళాశాలలు, పాఠశాలలు, క్లబ్‌లు నిర్మించారు.
అసలు విషయం ఏమిటంటే...
కోదాడ పెద్దచెరువు మొత్తం 727 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 413.27 ఎకరాలు శిఖం భూమిగా, 107.37 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్డ్‌ల్యాండ్ 49.04 ఎకరాలు, ఇనాం భూములు 34.32 ఎకరాలు, పట్టా భూములు 121.36 ఎకరాలున్నాయి. దీని కింద 938 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కోదాడ, అనంతగిరి, ఖానాపురం రెవెన్యూ పరిధిలో ఉంది. ఈ చెరువు కోదాడ పట్టణానికి ఆనుకుని ఉండడంతో ఆక్రమణలు జోరుగా సాగాయి. ప్రస్తుతం ఈ చెరువులో 200 ఎకరాలకుపైగా ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణలపై అనేక సంవత్సరాలుగా పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆక్రమణదారులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది.
ఆక్రమణదారులు ఎంత మందంటే..
కోదాడ పద్దచెరువు ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కోదాడ మున్సిపాలిటీ అధికారులు ఒక రిపోర్టు (నెం:జీ1/530/24 తేదీ 06–01–25)ఇచ్చారు. అదేవిధంగా కోదాడ ఆర్డీఓ మరో రిపోర్టు (నెం ఈ/954/2020 తేదీ 0–01–2025) ఇచ్చారు. దీని ప్రకారం 2010కి ముందు 319 మంది, ఆ తరువాత 53 మంది మొత్తం 372 మంది పెద్ద చెరువులో వివిధ రకాలుగా ఆక్రమణలు పాల్పడ్డారని తేల్చారు. పట్టణ పరిధిలో చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని రిపోర్టు ఇచ్చారు. ఆక్రమ నిర్మాణాలుగా అధికారులు పేర్కొన్న వాటిలో రామిరెడ్డిపాలెం రోడ్డులో ఉన్న ఇండోర్ సబ్‌స్టేషన్, మినీ మోటార్ వెహికిల్ స్టాండ్, రిక్రియేషన్ క్లబ్, దాని సమీపంలోని అపార్టుమెంట్, కల్యాణమండపం, కళాశాలలు, స్కూళ్లు, పార్టీ కార్యాలయాలతోపాటు నివాస గృహాలు, కోదాడ పబ్లిక్‌క్లబ్ నూతన భవనం ఉన్నాయి.
కోదాడ పెద్ద చెరువు ఆక్రమణ విషయంలో ప్రభుత్వ అధికారులు పనితీరు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. చెరువు ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు నివేదిక ఇచ్చిన అధికారులే సదరు ఇళ్లు నిర్మాణం చేసిన శిఖంలోకి మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు, మంచినీటి పైప్‌లైన్స్, విద్యుత్ సౌకర్యం, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. కోర్టుకు ఇచ్చిన నివేదికలో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోదాడ పెద్దచెరువు కట్టపైనే పక్కా గృహాల నిర్మాణం జరిగినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా అక్కడ సీసీ రోడ్డు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. కాని కోర్టుకు మాత్రం తాము 2010 తరువాత ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని రిపోర్టు ఇచ్చారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం


