వ్యర్థాలతో ఆదాయ మార్గం
కోదాడ: ఉపాయం ఉండాలేగాని ఇసుక నుంచి తైలం తీయవచ్చంటారు పెద్దలు. వ్యర్థాల నుంచి ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. కోదాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్తకు వచ్చిన ఆలోచనల నుంచి పుట్టిందే ఈ వినూత్న వ్యాపారం. తాగిపడేసిన కొబ్బరి బోండాల నుంచి పరుపులు, వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించే కొబ్బరిపీచు, ఇండోర్ ప్లాంట్స్, ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించే కోకోపిట్ తయారు చేస్తున్నారు. తద్వారా పట్టణంలో తాగి పడేసే కొబ్బరి బోండాల వ్యర్థాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తున్నారు.
పట్టణంలో ఉచితంగా సేకరణ..
కోదాడకు చెందిన దివంగత అధ్యాపకుడు మధిర కృష్ణారెడ్డికి 2020లోనే మొదట ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అనారోగ్యంతో ఆయన మృతి చెందడంతో కొంతకాలంపాటు ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆయన కుమారులు శ్రావణ్‌కుమార్, విక్రమాదిత్యలు అమెరికాలో ఉండేవారు. తమ తండ్రి ఆశయమైన ఈ పరిశ్రమను 2024లో కోదాడ సమీపంలోని దోరకుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేశారు. శ్రావణ్‌కుమార్, విక్రమాదిత్యల మాతృమూర్తి మధిర హంసవేణి పరిశ్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో పట్టణంలో ప్రజలుతాగి పడేసే కొబ్బరి బోండాలను మున్సిపాలిటీ వారు ట్రాక్టర్ల ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్‌లో పోసేవారు. కొంత మంది వ్యాపారులు వీటిని రోడ్లవెంట పడేసేవారు. వీటి వల్లదోమలు వ్యాప్తి చెంది పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడేవారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఈ బోండాలను ప్రాసెస్ చేసి వాటి నుంచి పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ట్రాక్టర్ ద్వారా పట్టణంలో తాగి పడేసే కొబ్బరి బోండాలను వీరు సేకరిస్తారు. వీటిని పరిశ్రమ వద్దకు తరలించి ప్రాసెస్ చేస్తారు. మొదటి ఉత్పత్తిగా పీచును తయారు చేస్తారు. ఆ తరువాత ఇండోర్‌ప్లాంట్స్‌కు ఉపయోగించే కోకోపిట్‌ను తయారు చేస్తారు. పీచును పరుపులు, వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించేవారు కొనుగోలు చేస్తున్నారు. కోకోపి ట్‌ను ఇండోర్‌ప్లాంట్స్ పెంచుకునేవారు కొనుగోలు చేస్తున్నారు.
తాగిపడేసిన కొబ్బరి బోండాల వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా వాటిని ఉపయోగించాలనే ఆలోచన నుంచే ఈ పరిశ్రమ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం వీటి వినియోగంపై స్థానికులకు అవగాహన లేదు. మొక్కలకు ఎరువుగా కోకోపిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేజీల లెక్కన విక్రయిస్తాము. ఇటుకల తయారీలో ఉపయోగించే అవకాశంపై ఆలోచన చేస్తున్నాం.
– మధిర హంసవేణి,
పరిశ్రమ నిర్వాహకురాలు
ఫ కొబ్బరిబోండాల వ్యర్థాలతో
ఉత్పత్తులు
ఫ కొబ్బరిపీచు, కోకోపిట్ తయారీ
ఫ మార్కెట్‌లో మంచి డిమాండ్
ఫ ఆర్థికంగా లబ్ధిపొందుతున్న
కోదాడ వాసి


