పంచాయతీ పోరుకు సిద్ధం
స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్
బ్యాలెట్ బాక్సులు సిద్ధం..
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బంది నుంచి బ్యాలెట్ బ్యాక్స్‌లు, బ్యాలెట్ పత్రాల వరకు అన్నీ పూర్తయ్యాయి. ఇంతలోనే రిజర్వేషన్ల అంశంపై కోర్టు కేసులు, తదితర కారణాలతో పరిషత్తు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సైతం ప్రకటించగా.. మరోమారు ఈ ఓటరు జాబితాను సవరించనున్నారు. ఇందుకు మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి సారించారు.
4,388 వార్డులు..
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 4,388 వార్డులు ఉండగా.. 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది ఉన్నారు. ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటించింది. ఈ జాబితాలతోనే మొదటగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం భావించింది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలని, ఈ మేరకు రిజర్వేషను ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను సైతం మొదలు పెట్టింది.
కోర్టు కేసులతో..
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రాగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇవి నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్రేకులు పడ్డాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొదటగా 50 శాతం రిజర్వేషన్లుదాటకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే ఓటర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. దాదాపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి కావాల్సిన శిక్షణ రెండువిడతల్లో జరగ్గా.. చివరి విడత మిగిలిపోయింది. కాగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించి.. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పూర్తయిన ఎన్నికల ఏర్పాట్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం భావిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియోవీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపీడీఓలు తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామపంచాయతీ, వార్డు వారీగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా తనిఖీచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు అనుకూలంగా ఉన్నాయోలేవో గుర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా ఆధారంగా తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే–2024 ఆధారంగా చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కె. నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, జిల్లా పరిషత్ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శిరీష, డీఎల్‌పీఓ నారాయణ రెడ్డి, పార్థసారధి పాల్గొన్నారు.
ఫ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం
ఫ ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధం
ఫ మరోమారు ఓటరు జాబితా
సవరణకు అవకాశం
ఫ బ్యాలెట్ బాక్సులు,
బ్యాలెట్ పత్రాలు రెడీ
ఫ సిబ్బందికి శిక్షణ పూర్తి
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెటు బాక్సులు, బ్యాలెటు పేపర్లను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నందున పోలింగ్ బాక్సులు జిల్లాలో ఉన్న వాటితో పాటు ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెప్పించి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచారు. బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే తెచ్చి సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి కూడా గతంలోనే మొదటి విడత శిక్షణ ఇచ్చారు.


