వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం విశేషపూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో కల్యాణం నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం ,రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అదేవిధంగా కార్తీక మాసం పురస్కరించుకుని శివాలయంలోని శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జి బి.జ్యోతి,కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు , ఆంజనేయా చార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.


