లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలి
హుజూర్‌నగర్ : దేశంలో లౌకిక భావజాలం ఉన్న పార్టీలు ఏకంకావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. గద్వాలలో ప్రారంభమైన సీపీఐ ప్రచారజాతా గురువారం హుజూర్ నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో ఉన్నాయంటూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ మాట్లాడుతూ బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశ సంపద కొన్ని వర్గాల వద్దనే కేంద్రీకృతం అయ్యిందన్నారు. కార్యక్రమంలో తొలుత ప్రచార జాతాకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, కొప్పోజు సూర్యనారాయణ, ఉస్తేల నారాయణరెడ్డి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సజన, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, నాయకులు జడ శ్రీనివాస్, గుండా రమేష్, టి వాసుదేవరావు, రమేష్, ఉమ, పద్మ, సంధ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి వెంకట్ రెడ్డి


