
నానో యూరియాతో రైతులకు ప్రయోజనం
నేరేడుచర్ల: నానో యూరియాతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. శ్రీధఽర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల ప్రాథమిక సహకార సంఘంలో యూరియా పంపిణీని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియాలో తయారయ్యే నానో యూరియా వినియోగిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. నానో యూరియా వాడటం వల్ల భూసారం దెబ్బతినదని, పురుగులు, తెగుళ్ల బాధ తగ్గుతుందన్నారు. గత ఏడాది ఆగస్టులో 29 వేల మెట్రిక్ టన్నులు, ఈ ఏడాది ఆగస్టులో 31వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. సెప్టెంబర్‌లో జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అదనంగా మరో 116 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది సూర్యాపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది 4.40 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు నాట్లు వేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి జావెద్, నేరేడుచర్ల క్లస్టర్ ఈఏఓ స్నేహలత, సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్, సిబ్బంది రామచంద్రారెడ్డి ఉన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి