
క్రమబద్ధీకరణపై ఆశలు
భూ భారతి చట్టం కారణంగా..
భానుపురి (సూర్యాపేట) : సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ధరణితో పాటు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా ఏళ్ల తరబడి ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి వీలు కలగలేదు. సాదాబైనామా దరఖాస్తులపై ఉన్న స్టేను ఇటీవల హైకోర్టు ఎత్తివేసింది. దీంతో వీటి క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. జిల్లాలో సాదాబైనామా కింద దాదాపు 29,814 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కబ్జాలో ఉండి.. పట్టాలు లేకపోవడంతో..
గతంలో భూముల క్రమవిక్రయాలు తెల్లకాగితాలపైనే జరిగేవి. ఇలా కొనుగోలు చేసి భూములను సాగు చేసుకునే వారు. బ్యాంకు రుణాలు కావాల్సిన వారు పట్టాలు చేసుకున్నా చాలావరకు ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండానే సాగింది. అయితే రుణమాఫీ లాంటి పథకాలను ప్రభుత్వాలు అమలు చేయడంతో కొంత మార్పు వచ్చింది. అయినా చాలామంది భూములను పట్టాలు చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వ రికార్డులో భూములు అమ్మినా వారి పేర్లే కొనసాగాయి. రైతుబంధు, రుణమాఫీ పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ ధరణిలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న పేర్లనే నమోదు చేయగా సాధారణ పేపర్లతో భూములను కొనుగోలు చేసి.. కబ్జాలో ఉన్న వారికి హక్కులు లేకుండా పోయాయి. చాలాచోట్ల భూములు అమ్మిన వారికే పట్టాదారు పాస్‌బుక్‌లు రావడంతో కొత్త సమస్యలు తలెత్తాయి.
ఫ సాదాబైనామా దరఖాస్తులపై
హైకోర్టులో స్టే ఎత్తివేత
ఫ ఏళ్ల తరబడి ఎదురు చూపులకు కలగనున్న మోక్షం
ఫ జిల్లా వ్యాప్తంగా
29,814 దరఖాస్తులు పెండింగ్
రైతుల భూసమస్యలకు ప్రధానంగా ధరణి పోర్టలే కారణమని, దీని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూ సమస్యలే కాకుండా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పి అమలు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదాబైనామాలకు అవకాశం కల్పించడంతో పాటు ఆర్డీఓలకు బాధ్యతలు అప్పగించింది. 90 రోజుల్లో ఈ దరఖాస్తులకు పరిష్కారం చూపాలని ఈ కొత్త చట్టంలో పేర్కొన్నారు. అయితే సాదాబైనామా రెగ్యులైజేషన్ కోసం 2020లో ప్రభుత్వం ఇచ్చిన జీఓపై హైక్టోర్టు ఇచ్చిన స్టే అడ్డంకిగా మారింది. ఈ స్టేను ఎత్తివేతకోసం ప్రభుత్వం ప్రయత్నించగా అనుకూలంగా తీర్పు రావడంతో సాదాబైనామా దరఖాస్తు దారుల్లో ఆశలు రెకేత్తాయి.