
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
భానుపురి (సూర్యాపేట) : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు దారి తప్పకుండా క్రమశిక్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యయులదే అని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో అత్యవసర సందర్భాలలో తప్పించి సోమ, మంగళవారాలు ఉపాధ్యాయులు విధిగా నూరు శాతం హాజరు కావాలని, అదేవిధంగా మిగతా రోజుల్లో టీచర్ల హాజరు శాతం పెంచాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రతి రోజు 9,10 తరగతుల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రగతి గ్రూప్స్ పేరిట అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, శ్రావణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.