
మునగాల: జిల్లా వ్యాప్తంగా ఉద్యానపంటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి తీగల నాగయ్య తెలిపారు. మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ వద్ద సాగుచేసిన బంతి, మిర్చి తోటలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అధిక ఆదాయం ఇచ్చే పండ్లు, కూరగాయలు, పూలతోటలు, ఇతర వాణిజ్య పంటల సాగుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణ పథకం, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మనీటి పారుదల పథకం, వెదురు మిషన్ పథకాలకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ఎకరానికి రూ.9,600రాయితీ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం మాధవరం గ్రామంలో ఉన్న ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఉద్యాన వన డివిజన్ విస్తరణాధికారులు రంగు ముత్యంరాజు, యానాల సుధాకర్‌రెడ్డి, వంగూరి అనిల్, రైతు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.